రెయిన్‌కోట్ అనుకుని పీపీఈ కిట్ దొంగిలించిన మందుబాబు.. తీరా కరోనా పరీక్ష చేస్తే..!

ABN , First Publish Date - 2020-08-02T00:42:24+05:30 IST

తీవ్ర గాయాలతో ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన మందుబాబు.. పోతూపోతూ కరోనా వైరస్‌ను వెంటబెట్టుకుని వెళ్లిన వైనమిది...

రెయిన్‌కోట్ అనుకుని పీపీఈ కిట్ దొంగిలించిన మందుబాబు.. తీరా కరోనా పరీక్ష చేస్తే..!

నాగ్‌పూర్: గాయాల కారణంగా ఓ ఆస్పత్రిలో చేరిన మందుబాబు.. పోతూపోతూ కరోనా వైరస్‌ను వెంటబెట్టుకుని వెళ్లిన వైనమిది. రెయిన్ కోటు అనుకుని ఓ పీపీఈ కిట్‌ను దొంగిలించడంతో అతడికి కొవిడ్-19 సోకింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నగరంలో కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తి బుధవారం సాయంత్రం పీకలదాకా మద్యం సేవించాడు. ఇంటికి తిరిగివస్తూ మార్గమధ్యంలోనే ఓ డ్రైనేజీలో జారి పడిపోయాడు. అతడు తీవ్రంగా గాయపడడంతో అక్కడే ప్రథమ చికిత్స చేయించిన స్థానికులు.. మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని మయో ఆస్పత్రిలో చేర్పించారు.


చికిత్స పూర్తయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు అతడు దొంగచాటుగా ఓ పీపీఈ కిట్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. దాన్ని కొనుగోలు చేసేందుకు తనకు రూ.1000 ఖర్చయిందంటూ తన స్నేహితుడితో చెప్పాడు. అయితే అది రెయిన్ కోట్ కాదనీ... కొవిడ్-19 పరీక్షల కోసం అధికారులు ధరించే పీపీఈ కిట్ అని స్థానికులు గుర్తుపట్టారు. క్షణాల వ్యవధిలో ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో... నగర ఆరోగ్య విభాగం అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అతడి నుంచి పీపీఈ కిట్ స్వాధీనం చేసుకుని, మంటల్లో తగలబెట్టారు. అతడి నుంచి స్వాబ్ నమూనాలు సేకరించి పరీక్షించగా.. కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. కాగా అతడికి సమీపంగా మెలిగిన అందరికీ పరీక్షలు చేశామనీ.. వారందరికీ నెగిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు.  

Updated Date - 2020-08-02T00:42:24+05:30 IST