డ్రాగన్.. ఓ క్రేజీ ఫ్రూట్
ABN , First Publish Date - 2020-12-20T17:30:29+05:30 IST
ఆపిల్, అనాస, బొప్పాయ, అరటి, జామ, పుచ్చకాయలతో పాటు ఇటీవల మార్కెట్‌లో అన్ని వేళలా కన్పిస్తోన్న పండు డ్రాగన్.

ఆపిల్, అనాస, బొప్పాయ, అరటి, జామ, పుచ్చకాయలతో పాటు ఇటీవల మార్కెట్‌లో అన్ని వేళలా కన్పిస్తోన్న పండు డ్రాగన్. ఇందులోని పోషక విలువల వల్ల దీనిని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ అయింది.
బ్రహ్మజముడు జాతి...
డ్రాగన్ ఫ్రూట్ తోలు రంగేమో ముదురు గులాబీ, పొలుసులు ఆకుపచ్చ, కోసి చూస్తే తెలుపు, గింజలేమో నలుపు, రుచేమో పులుపు, తీపిల కలబోత. ఇది బ్రహ్మజముడు జాతికి చెందిన రకం. అత్యధికంగా ఎగుమతి చేసే దేశం వియత్నాం. ఇటీవల చైనా కూడా ఊపందుకుంది. ఈ పండులో ఎన్నో వెరైటీలు. గులాబీ, ఎరుపు, పసుపుపచ్చ లాంటి రంగులవీ ఉన్నాయి. అయితే ఎక్కువ వ్యాప్తిలో ఉంది మాత్రం ఎరుపు రంగు పండు. మధ్య అమెరికాలో దీనిని ‘పితాయా’ అని పిలుస్తారు.
రుచిపరంగా చెప్పాలంటే కివి పండులాగే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది. విత్తనాలు నలుపు రంగులో కరకరలాడుతూ రుచికరంగా అన్పిస్తాయి. వీటిలో లిపిడ్స్ ఎక్కువ. తోలు తీసి పండును ముక్కలు చేసుకుని తినడం పరిపాటి. ఫ్రూట్ సలాడ్స్‌లోనూ కలుపుకోవచ్చు. జ్యూసులు, స్మూతీలూ రుచికరంగా ఉంటాయి. ముక్కలకి తేనెను కలుపుకుని స్నాక్స్‌లాగా తీసుకోవచ్చు. ఎండాకాలంలో డ్రాగన్ ఫ్రూట్స్ జ్యూసులకు గిరాకీ ఎక్కువ. బీటాసైయనిన్ పిరమిడ్ల వల్ల పండు ఎర్రగా ఉంటుంది. వైద్యరంగంలోనే కాదు మద్యపానీయాలలో కూడా డ్రాగన్ పండును వాడతారు. దీని పువ్వులతో టీని తయారుచేస్తారు. డ్రాగన్‌కు పెరుగుతున్న డిమాండ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండును సాగు చేస్తున్నారు. నీటి అవసరం అంతగా ఉండదు ఈ పంటకు. మార్కెట్లో కొనేప్పుడు మరీ మెత్తగా, గట్టిగా కాకుండా మధ్యస్తంగా ఉన్న పండును చూసుకుని తీసుకోవాలి. ఒకసారి రుచిచూస్తే మళ్లీ తినాలనిపించే పండు డ్రాగన్.
పోషకాల గని
విటమిన్ - సి ఎక్కువ. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్- బి1, బి2, బి3 లు ఇందులో ఉండడం వల్ల రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. చర్మ సౌందర్యానికి, కొలెస్ట్రాల్ స్థాయులను అదుపుచేస్తుంది, థైరాయిడ్ పనితీరుకు తోడ్పడుతుంది.
పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఓ కప్పు డ్రాగన్ పండును తింటే ఏడు గ్రాముల పీచు పదార్థం అందుతుంది. ఇది సగటు మనిషి ఓ రోజు తీసుకోవలసిన ఫైబర్‌తో సమానం.
కెరొటిన్ సమృద్ధిగా ఉండడం వల్ల పేగుల్లోని ఫంగై, బాక్టీరియాల నుంచి రక్షణ కలిగిస్తుంది.
పండులో ఉన్న చిన్న చిన్న గింజల్లో ఫాటీ ఆసిడ్స్ ఉన్నాయి. ఇందులోని మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.