104 ఏళ్ల డాక్టర్.. వందలమందికి తండ్రి!

ABN , First Publish Date - 2020-12-15T22:17:38+05:30 IST

ఆమె 50లలో ఉంది. తన అక్కతో మాట్లాడుతుండగా... తమ తండ్రి అసలు తండ్రి కాదని తెలిసింది. ఇక అప్పటి నుంచి ఆమెకు కంటిమీద కునుకు లేదు. అలా వెతుక్కుంటూ ... తన వంశ వృక్షాన్ని తెలుసుకుని... ఆఖరుకి తన జన్మకు కారణమైన వ్యక్తిని కలుసుకుంది.

104 ఏళ్ల డాక్టర్.. వందలమందికి తండ్రి!

ఇంటర్నెట్ డెస్క్: ఆమె 50లలో ఉంది. తన అక్కతో మాట్లాడుతుండగా... తమ తండ్రి అసలు తండ్రి కాదని తెలిసింది. ఇక అప్పటి నుంచి ఆమెకు కంటిమీద కునుకు లేదు. అలా వెతుక్కుంటూ ... తన వంశ వృక్షాన్ని తెలుసుకుని... ఆఖరుకి తన జన్మకు కారణమైన వ్యక్తిని కలుసుకుంది. అమెరికాకు చెందిన జైమీ హాల్ జీవితకథ ఇది. హాల్‌కే కాదు ఆమెతో పాటు వందలాదిమందికి ఆయనే తండ్రి. ఆశ్యర్యంగా ఉందా... 


డాక్టర్ ఫిలిప్ పీవెన్.. వయస్సు 104 ఏళ్లు. ప్రసూతి వైద్యంలో 40ఏళ్ల అనుభవం ఆయన సొంతం. స్పెర్మ్ డోనర్‌గా వందలాది మంది పిల్లల జన్మకు కారణమయ్యారు. సంతాన లేమితో బాధపడుతున్న తల్లిదండ్రులకు ఆధునిక వైద్యశాస్త్రం అందించిన అవకాశం ద్వారా ఆ బాధను తీర్చారు. జైమీ హాల్ అలా పుట్టినవారే. ఆమె తల్లిదండ్రులకు పిల్లలు లేరు. వారి ఫ్యామిలీ డాక్టర్ అయిన డాక్టర్ పీవెన్ వీర్యాన్ని అందించగా హాల్ జన్మించింది. ఆమెతో పాటు ఆమె అక్కకు కూడా బయోలాజికల్ తండ్రి ఆయనే.   

జైమీ హాల్‌కు తమ అసలు తండ్రి గురించి తెలియకమునుపు ఆమె చాలా కష్టపడింది. హాస్పిటల్‌లో ఇచ్చిన సర్టిఫికెట్లను బయటకు తీసింది. అక్కడ ప్రసూతి వైద్యుడిగా ఉన్న డాక్టర్ పీవెన్ పేరు ఉండటాన్ని గమనించింది. కానీ ఆయన్ను పట్టుకోవడం ఎలా.. ఆయన్ను కలవడం ఎలా.? ఇప్పుడేమో తన తల్లిదండ్రులు కూడా లేరు. అనుకోకుండా డాక్టర్ పీవెన్ మనవడి డీఎన్ఏ తన అక్క డీఎన్ఏతో పోలడంతో.. దాని ఆధారంగా తమ తండ్రి ఎవరో తమకు తెలిసిందని ఓ ప్రముక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఆయన మనవడి డీఎన్ఏతో తన సోదరి కూతురు డీఎన్ఏ కూడా పోల్చి చూశామని తెలిపారు. 2017 నుంచి 2019 వరకు తమ ప్రయత్నం సాగిందని ఆమె అన్నారు. 


తన సోదరి సాయంతో ఆమె డాక్టర్ పీవెన్ నివాసం ఉంటున్న మిచిగాన్‌లోని సదర్ ఫీల్డ్ 2కు వెళ్లారు. అక్కడ ఆయన్ను కలుసుకుని తమ భావోద్వేగాన్ని పంచుకున్నారు. ఆ సందర్భంగా తమ దగ్గరకు వచ్చే తల్లిదండ్రుల బాధను చూసి.. ఆ నాటి తమ పరిశోధనల్లో భాగంగా తమ వీర్యాన్ని చాలా మంది తల్లిదండ్రులకు ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. తన తోటి డాక్టర్లు కూడా వీర్యదాతలేనని ఆనాటి పరిస్థితులను వివరించారు. 


1941లో డాక్టర్ పట్టా పొందిన డాక్టర్ పీవెన్.. కృత్రిమ గర్భధారణ పరిశోధనలకు సంబంధించి మొదటి తరం వ్యక్తి. రికార్డుల ప్రకారం ఆయన కెరీర్ మొత్తంలో 9వేల ప్రసవాలు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆయన.. చికాగోలోని మైఖేల్ రిసీ హస్పిటల్, మెడికల్ సెంటర్లలో ట్రెయినింగ్ తీసుకున్నారు. 70 ఏళ్ల వయస్సులో 1987వ సంవత్సరంలో అక్కడే రిటైర్డ్ అయ్యారు. మిచిగాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులలో 1941 బ్యాచ్‌లో ఇప్పటికీ బతికున్న ఏకైక వ్యక్తి డాక్టర్ పీవెన్.   

Updated Date - 2020-12-15T22:17:38+05:30 IST