మహిళ కడుపులోంచి 50 కేజీల కణతి తొలగింపు.. వైద్య చరిత్రలో ఇదో రికార్డ్!
ABN , First Publish Date - 2020-08-23T01:44:33+05:30 IST
వైద్య చరిత్రలో ఇదో రికార్డు. ఓ రోగి శరీర బరువులో దాదాపు సగం బరువున్న అండాశయ కణతి (ఒవేరియన్
న్యూఢిల్లీ: వైద్య చరిత్రలో ఇదో రికార్డు. ఓ రోగి శరీర బరువులో దాదాపు సగం బరువున్న అండాశయ కణతి (ఒవేరియన్ ట్యూమర్)ని ఢిల్లీ వైద్యులు తొలగించి రికార్డు సృష్టించారు. దాదాపు 50 కేజీల బరువున్న కణతిని తొలగించడం ప్రపంచంలోనే ఇది తొలిసారని వైద్యులు తెలిపారు. ఢిల్లీకి చెందిన 52 ఏళ్ల మహిళ గత కొన్ని నెలలుగా బరువు పెరుగుతూ ఏకంగా 106 కిలోలకు చేరుకుంది.
ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, నడవడం, నిద్రలో ఇబ్బందులు ఎదురుకావడంతో వెంటనే ఆమెను ఇంద్రప్రస్థలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అండాశయంలో అతిపెద్ద కణతి పెరుగుతున్నట్టు గుర్తించారు. అది ఆమె పేగులపై ఒత్తిడి పెంచుతోందని, ఫలితంగా కడుపులో తీవ్రమైన నొప్పి, ఆహారం జీర్ణం కావడంలో సమస్యలకు కారణమవుతున్నట్టు గుర్తించినట్టు ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, బేరియాట్రిక్ సర్జరీ వైద్యుడు డాక్టర్ అరుణ్ ప్రసాద్ తెలిపారు.
అలాగే, ఆమె హిమోగ్లోబిన్ ఆరుకు పడిపోయిందని, ఇది రక్తహీనతకు కారణమైందని పేర్కొన్నారు. ఈ నెల 18న మూడున్నర గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి ఆమె అండాశయం నుంచి 50 కేజీల కణతిని వెలికి తీసినట్టు తెలిపారు.
తన 30 ఏళ్ల వైద్య వృత్తిలో రోగి శరీర బరువులోని సగం బరువున్న కణతిని ఇప్పటి వరకు చూడలేదని డాక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. 2017లో కోయంబత్తూరులో ఓ మహిళ అండాశయం నుంచి 34 కేజీల కణతిని వెలికి తీశారని, ఇప్పటి వరకు ఇదే రికార్డని వివరించారు.
కణతి విపరీతంగా పెరిగిపోవడంతో ఆమె ఉదర భాగంలో ల్యాప్రోస్కోపీ, రోబో సహాయక పద్ధతుల ద్వారా పరికరాలను పంపేందుకు అవసరమైన స్థలం లేకపోయిందని, దీంతో సంప్రదాయ పద్ధతుల ద్వారా శస్త్రచికిత్స చేసినట్టు వివరించారు. సర్జరీ తర్వాత ఆమె బరువు 56 కేజీలు ఉన్నట్టు ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ తివారీ తెలిపారు.