-
-
Home » Prathyekam » doctors conducted operation while showing big boss tv show to patient
-
బిగ్‌బాస్ షో చూపిస్తూ ఆపరేషన్.. డాక్టరా మజాకా..!
ABN , First Publish Date - 2020-11-21T16:53:40+05:30 IST
మెదడుకు చికిత్స చేసేటప్పుడు రోగి మెలకువగా ఉండడం ఎంతో అవసరం. అంటే రోగిని మెలకువగా ఉంచి కపాలం పగలగొడతారన్నమాట. వినడానికే భయంగా...
ఇంటర్నెట్ డెస్క్: మెదడుకు చికిత్స చేసేటప్పుడు రోగి మెలకువగా ఉండడం ఎంతో అవసరం. అంటే రోగిని మెలకువగా ఉంచి కపాలం పగలగొడతారన్నమాట. వినడానికే భయంగా ఉంది కదూ. కానీ తప్పదు. గుంటూరులో ఇలాంటి బ్రెయిన్ ఆపరేషన్ ఒకటి డాక్టర్లు చేశారన్నమాట. అయితే ఆపరేషన్ సమయంలో రోగిని మెలకువగా ఉంచేందుకు డాక్టర్లు చక్కగా టీవీలో బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాలను చూపించారు. విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామానికి చెందిన వరప్రసాద్(33)కు మెదడులో కణితి(బ్రెయిన్ ట్యూమర్) ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో 2016లో హైదరాబాద్‌లో శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. అనంతరం పలు దఫాలుగా రేడియేషన్ ఇచ్చారు. అయినప్పటికీ గత కొన్ని నెలల నుంచి ఆయనకు తరచుగా ఫిట్స్ వస్తున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా మెదడులో కణితి మళ్లీ పెరిగినట్లు తేలింది. దీంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

శస్త్రచికిత్సలో జీజీహెచ్ డాక్టర్లు భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్, త్రినాథ్ పాల్గొన్నారు. ఈ నెల 10న మెదడు త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకున్నారు. నావిగేషన్ పరిజ్ఞానం సాయంతో కచ్చితంగా కణితి ఎక్కడో గుర్తించి ఆ ప్రదేశంలోనే కపాలం తెరిచి ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. మెదడులో మాటలు, సంభాషణకు కీలకమైన ప్రాంతంలో సర్జరీ చేస్తున్నందున రోగి స్పృహలో ఉండడం అత్యవసం. అందువల్ల రోగిని మెలకువగా ఉంచి ఈ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే వరప్రసాద్‌కు బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాలను చూపించారు వైద్యులు. అదే సమయంలో సర్జరీని దిగ్విజయంగా పూర్తి చేశారు.

ఇదిలా ఉంటే అక్కడ రోగికి పైసా ఖర్చు లేకుండా బీమా సౌకర్యంతో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి పూర్తిగా కోలుకున్నందున ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు చెప్పారు.
