దోశ నుంచి చాక్లెట్ దాకా.. సొంత డబ్బులతో కరోనా పేషెంట్ల కోర్కెలు తీరుస్తున్న డాక్టర్

ABN , First Publish Date - 2020-04-27T00:59:12+05:30 IST

క్వారంటైన్ సెంటర్లలో ఉన్న కరోనా బాధితులకు ఎలాంటి వైద్యం అందిస్తారు.. ఏం పెడతారు.. ...

దోశ నుంచి చాక్లెట్ దాకా.. సొంత డబ్బులతో కరోనా పేషెంట్ల కోర్కెలు తీరుస్తున్న డాక్టర్

బెంగళూరు: క్వారంటైన్ సెంటర్లలో ఉన్న కరోనా బాధితులకు ఎలాంటి వైద్యం అందిస్తారు.. ఏం పెడతారు.. వారితో డాక్టర్లు ఎలా వ్యవహరిస్తారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు దేశ వ్యాప్తంగా ఎలా ఉన్నా అక్కడ మాత్రం వినూత్నంగా ఉంటాయి. కరోనా బాధితులు అడగడమే తరువాయిగా ఏది కోరితే అది వారి ముందుంటుంది. చిప్స్ నుంచి దోశల వరకు, నెయిల్ కటర్ల నుంచి రేజర్ల వరకు, ఆటబొమ్మలు అన్నీ వారికందుతాయి. ఈ సౌకర్యాలన్నీ వారికి అందిస్తోంది ఓ డాక్టర్. అది కూడా ఆమె సొంత డబ్బులతో సమకూరుస్తున్నారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో ఉన్న ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్‌‌ను ఇటీవల కరోనా బాధితులకు చికిత్స అందించే క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. ఈ బ్లాక్‌ మొత్తానికి నోడల్ ఆఫీసర్, ఇన్‌చార్జిగా డాక్టర్ ఆశిమా బాను ఉన్నారు. ఆ బ్లాక్‌లో ఉన్న కరోనా బాధితులందరికీ ఏం కావాలన్నా ఆమె సమకూరుస్తారు. అయితే అందరి కోరికలు తీర్చడం అంత సులువేమీ కాదు. అయినప్పటికీ ఆమె నవ్వుతూ వారు అడిగిందల్లా అందిస్తుంటారు. దీనిపై ఆమె స్పందిస్తూ, పేషెంట్లకు చికిత్స చేయడమే తన పని కాదని, వారి చిన్న చిన్న కోరికలు తీర్చడం కూడా ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. పూర్తిగా కోలుకునే వరకు వారిని ఆనందంగా ఉంచడం కూడా ఎంతో ముఖ్యమని ఆశిమా చెబుతారు. ‘ఇక్కడికి పేషెంట్లు వచ్చేటప్పుడు వారి వెంట ఫోన్ తప్ప మరేమీ ఉండదు. వారికి కావలసిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మాపైనే ఉంటుంద’ని అంటారు. దీనికోసం ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశానని, అందులో పేషెంట్లందరి నంబర్లు యాడ్ చేశానని, వారికి ఏం కావాలన్నా గ్రూప్‌లో పోస్ట్ చేస్తారని, వెంటనే వారికది అందేలా చూస్తానని వివరించారు. ‘కొందరు పేషెంట్లు ఆట వస్తువులు కావాలని, కేకులు, చాక్లెట్లు కావాలని కోరుతారు. వారికి అవన్నీ అందేలా చూస్తాం’ అని అశిమా చెప్పుకొచ్చారు. 


ఇదిలా ఉంటే తమకు ఇన్ని సౌకర్యాలు అందిస్తున్న డాక్లర్ అశిమాను అక్కడి పేషెంట్లు ఎన్నడూ చూసింది లేదు. వారిని ఎక్కువగా నర్సులు, డాక్లర్లు మాత్రమే పరీక్షిస్తూ, చికిత్స అందిస్తూ ఉంటారు. అయితే తమకు ఏం కావాలన్నా అది డాక్టర్ ఆశిమా అందజేస్తారన్న విషయం మాత్రం వారికి తెలుసు.

Updated Date - 2020-04-27T00:59:12+05:30 IST