కోడలు ఛీకొట్టినా... ఆమె కోసం తన రెండు బంగారు గాజులు అమ్మి...

ABN , First Publish Date - 2020-12-26T16:59:14+05:30 IST

ఒక్కోసారి పరిస్థితులు తల్లకిందులై ఛీకొట్టినవారినే మరోమార్గంలేక ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి.

కోడలు ఛీకొట్టినా... ఆమె కోసం తన రెండు బంగారు గాజులు అమ్మి...

గోరఖ్‌పూర్: ఒక్కోసారి పరిస్థితులు తల్లకిందులై ఛీకొట్టినవారినే మరోమార్గంలేక ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. భార్య మాట విన్న ఒక భర్త తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఇప్పుడు ఆ తల్లే తన కోడలికి ప్రాణదానం చేసింది. వివరాల్లోకి వెళితే యూపీలోని గోరఖ్‌పూర్ పరిధిలో గల 67 ఏళ్ల బృంద జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూసింది. భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, ఆ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నడిపింది. ఉన్న ఏకైక కుమారునికి వివాహం జరిపించింది. 


భర్త ఉన్నంత కాలం ఆమె జీవితం సవ్యంగానే సాగింది. ఆ తరువాత కోడలు అత్తను వేధించడం ప్రారంభించింది. అటు భార్యకు చెప్పలేక, ఇటు తల్లిని సముదాయించలేక బృంద కుమారుడు నలిగిపోయేవాడు. అయితే ఇంతలో తల్లి అనారోగ్యం పాలయ్యింది. ఈ నేపధ్యంలో భార్య పోరు మరింత ఎక్కువ కావడంతో భర్త తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఎన్ఎన్ మౌర్య మాట్లాడుతూ బృంద ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి తన కుమారుడు, కోడలు గురించి తపించిపోయేదని, తరచూ ఫోన్ చేసి వారితో మాట్లాడుతుండేదని, కుమారుని నుంచి ఫోన్ రాకపోతే తెగ బాధపడేదని తెలిపారు. ఇంత జరుగుతున్నా కోడలు ఒక్కసారి కూడా వచ్చి అత్తను పరామర్శించిందే లేదన్నారు. అయితే ఉన్నట్టుండి కోడలు అనారోగ్యం బారిన పడిన విషయాన్ని బృంద తన కొడుకు ద్వారా తెలుసుకున్నదన్నారు. అలాగే కోడలికి ఆపరేషన్ చేయాల్సి ఉందని, అందుకు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కొడుకు ద్వారా తెలుసుకుంది. వెంటనే కొడుకును వృద్ధాశ్రమానికి పిలిపించి, ఏమాత్రం ఆలోచించకుండా తన చేతికి ఉన్న రెండు బంగారు గాజులను, చెవులకు ఉన్నదుద్దులు తీసి కుమారునికి ఇచ్చింది. వాటి విలువ లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని, వాటిని విక్రయించి కోడలుకు వైద్యం చేయించాలని కుమారుడికి చెప్పింది. ఈ దృశ్యాన్ని చూసినవారంతా ఆ తల్లి నిష్కల్మష మనసును చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఏ కోడలైతే తనను ఛీకొట్టిందో ఆమెకే ప్రాణాలు పోసేందుకు ముందుకు వచ్చిన అత్తను వృద్ధాశ్రమ నిర్వాహకులు, స్థానికులు అభినందిస్తున్నారు.

Updated Date - 2020-12-26T16:59:14+05:30 IST