కరోనా టీకాతో మనుషులు మొసళ్లుగా మారొచ్చు: బ్రెజిల్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-12-19T19:32:38+05:30 IST

కరోనా సంక్షోభం ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో తాజాగా కరోనా వ్యాక్సిన్లపై కూడా తన దాడి ప్రారంభించారు.

కరోనా టీకాతో మనుషులు మొసళ్లుగా మారొచ్చు: బ్రెజిల్ అధ్యక్షుడు

బ్రెజీలియా: కరోనా సంక్షోభం ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో తాజాగా కరోనా వ్యాక్సిన్లపై కూడా తన దాడి ప్రారంభించారు. అక్కడ టీకా పంపిణీ కొనసాగుతున్న తరుణంలోనే ఆయన.. ‘కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్లైపోవచ్చు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీకా తీసుకున్న వారిలో వచ్చే అనారోగ్య సమస్యలకు తాము బాధ్యత వహించమంటూ బ్రెజిల్‌తో ఫార్మా కంపెనీ ఫైజర్ చేసుకున్న ఒప్పందం ఆధారంగా ఆయన కరోనా టీకాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.


‘ఫైజర్‌తో కుదిరిన ఒప్పందంలో అంతా క్లియర్‌గానే ఉంది. ‘సైడ్ ఎఫెక్ట్ వస్తే మేం బాధ్యత తీసుకోం’ అని వారు చెప్పారు. కాబట్టి మీరు మొసళ్లుగా మారిపోతే అందుకు మీరే బాధ్యులు. అలా కాకుండా..మీకు అంతీంద్రియ శక్తులు వచ్చినా లేక..మహిళల్లో గడ్డాలు మొలిచినా, పురుషులు స్త్రీల గొంతుతో మాట్లాడినా కంపెనీ వారికేం సంబంధం ఉండదు’ అంటూ ప్రజల్లో భయాందోళనలు కలిగే రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుమనుపు..టీకా కార్యక్రమంలో ప్రారంభించే సమయంలోనూ తాను టీకా తీసుకోనని బోల్సోనారో స్పష్టం చేశారు.


అయితే..అక్కడి సుప్రీం కోర్టు మాత్రం టీకా వేయించుకోవడమనేది ప్రజలందరి బాధ్యత అని స్పష్టం చేసింది. కానీ..ఈ విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయబోమని కూడా హామీ ఇచ్చింది. అంటే..టీకా తీసుకోని వారిపై అక్కడి అధికారులు జరిమానాలు విధించవచ్చు లేదా వారిని బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా కట్టడి చేయవచ్చు. అంతేకానీ.. ప్రజలకు బలవంతంగా కరోనా టీకాలు వేసేలా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేరు. ఇక బ్రెజిల్‌లో ఇప్పటివరకూ 70 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా..1.85 పైచిలుకు కరోనా మరణాలు సంభవించాయి. 


Updated Date - 2020-12-19T19:32:38+05:30 IST