కారు వెనుక అద్దంపై కులం పేరు వాడినందుకు ఛలాన్..!

ABN , First Publish Date - 2020-12-28T22:14:35+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో కులం పేర్లను కారు అద్దాలపై, నంబర్ ప్లేట్లపై వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని యోగి సర్కార్ ప్రకటించిన కొద్ది రోజులకే...

కారు వెనుక అద్దంపై కులం పేరు వాడినందుకు ఛలాన్..!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కులం పేర్లను కారు అద్దాలపై, నంబర్ ప్లేట్లపై వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని యోగి సర్కార్ ప్రకటించిన కొద్ది రోజులకే ఆ నిబంధన అమల్లోకొచ్చింది. యూపీ రాజధాని లక్నోలో ఓ కారు వెనుక అద్దంపై ‘సక్సేనా జీ’ అని రాసి ఉంది. ఆ కారును ఆపిన పోలీసులు ఛలాన్ విధించారు. తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాం తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలో తిరుగుతున్న ప్రతీ 20 వాహనాల్లో ఒక వాహనంపై ఇలా కులం పేర్లతో కూడిన స్టిక్కర్లు అంటించి ఉన్నట్లు కాన్పూర్ డిప్యూటీ ట్రాన్‌పోర్ట్ కమిషనర్ డీకే త్రిపాఠి చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇలా వాహనాలపై కులంతో కూడిన స్టిక్కర్ల వినియోగం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ యూపీలో ఈ పోకడ మరింత ఎక్కువగా ఉంది.


యూపీలో సమాజ్‌వాదీ అధికారంలో ఉన్న సమయంలో చాలా వాహనాలపై ‘యాదవ్’ అనే స్టిక్కర్లు కనిపించేవి. ఆ కులానికి చెందిన వారు అధికారంలో ఉండటంతో కొందరు దాన్ని హోదాలా భావించేవారు. యూపీలో మాయావతి అధికారంలో ఉన్న సమయంలో కూడా జాతవ్ అనే కులం పేరుతో కూడిన స్టిక్కర్లను కొందరు వాహనాలపై అంటించుకునేవారు. బీఎస్పీ ప్రస్తుతం అధికారంలో లేకపోయినప్పటికీ ఇలా ‘జాతవ్’ పేరుతో ఉన్న వాహనాలు యూపీ రోడ్లపై చక్కర్లు కొడుతుండటం గమనార్హం.

Updated Date - 2020-12-28T22:14:35+05:30 IST