బాయిస్‌ లాకర్ రూమ్ కేసులో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2020-05-11T16:40:36+05:30 IST

దేశ రాజ‌ధాని ఢిల్లీకి చెందిన కొందరు విద్యార్థులు బాయిస్ లాకర్ రూమ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్ క్రియేట్ చేసి, గ్యాంగ్ రేప్ కామెంట్లు చేసిన ఉదంతం తీవ్ర దుమారం రేపిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు ఈ కేసులో...

బాయిస్‌ లాకర్ రూమ్ కేసులో కొత్త ట్విస్ట్

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీకి చెందిన కొందరు విద్యార్థులు బాయిస్ లాకర్ రూమ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్ క్రియేట్ చేసి, గ్యాంగ్ రేప్ కామెంట్లు చేసిన ఉదంతం తీవ్ర దుమారం రేపిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసుల విచారణకు భయపడిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ కేసును విచారిస్తున్న పోలీసులు ఈ గ్రూప్‌లో జ‌రిగిన సంభాష‌ణ‌లో ఎవ‌రిత‌ప్పూ లేద‌ని తేల్చిచెప్పారు. పైగా ఈ గ్రూప్‌లోని సభ్యులెవరూ అత్యాచారం, సామూహిక అత్యాచారం అన్న పదాలను వినియోగిస్తూ, అస‌లు చాటింగ్ అనేదే చేయలేదని పేర్కొన్నారు. అయితే ఒక అమ్మాయి సిద్ధార్థ్ అనే కల్పిత పేరును పెట్టుకుని స్నాప్‌చాట్‌లో గ్యాంగ్ రేప్ గురించి ప్ర‌స్తావించింద‌న్నారు. ఈ విధంగా త‌న స్నేహితుని మ‌నోగ‌తాన్ని తెలుసుకోవాల‌నుకున్న‌ద‌ని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన చాటింగ్‌ను స్క్రీన్ షాట్ తీసి, అది బాయిస్ లాకర్‌లో జరిగినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశార‌ని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆ అమ్మాయి సిద్దార్థ్ పేరుతో మ‌రో అమ్మాయిని అత్యాచారం చేద్దామని బాలుడితో చాట్ చేసింద‌న్నారు. ఈ విధంగా అత్యాచారంపై అతని అభిప్రాయాన్ని తెలుసుకోవాల‌నుకున్న‌ద‌న్నారు. అయితే ఆ బాలుడు ఇందుకు నిరాక‌రించి, చాటింగ్ నుంచి త‌ప్పుకున్నాడ‌ని పేర్కొన్నారు. ఈ ఉదంతంలో ఆ అమ్మాయి తప్పుడు ఐడీని క్రియేట్ చేయడం నేరమేన‌ని అన్నారు. అయితే ఆమె చెడు ఉద్దేశంతో అలా చేయ‌లేద‌ని, అందుకే ఈ ఉదంతంలో ఎవ‌రిపైనా కేసు నమోదు చేయలేద‌న్నారు.  


Updated Date - 2020-05-11T16:40:36+05:30 IST