లాక్‌డౌన్ వేళ ఇంటికి వెళ్లాలని ఆంటీని చంపేశారు.. కానీ పోలీసులు ఆమెను బతికించారు..!

ABN , First Publish Date - 2020-04-15T03:20:35+05:30 IST

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుచేస్తోంది. రైళ్లు, బస్సులు రాకపోకలు బంద్ కావడంతో...

లాక్‌డౌన్ వేళ ఇంటికి వెళ్లాలని ఆంటీని చంపేశారు.. కానీ పోలీసులు ఆమెను బతికించారు..!

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుచేస్తోంది. రైళ్లు, బస్సులు రాకపోకలు బంద్ కావడంతో ప్రజా రవాణా నిలిచిపోయింది. హైవేల పక్కన చెక్‌పోస్ట్‌ల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అయితే.. కొన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రం కొందరు సొంతూళ్లకు వెళ్లడానికి మినహాయింపునిస్తున్నారు. అది కూడా తగిన ఆధారాలు ఉన్నాయని ఖరారు చేసుకున్న తర్వాత మాత్రమే వారిని చెక్‌పోస్ట్ నుంచి ముందుకు సాగనిస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం అక్రమంగానైనా సొంతూరికి వెళ్లాలని పోలీసులకే కుచ్చుటోపీ పెడుతున్నారు. కొందరు పోలీసులు మాత్రం ఇలాంటి వారి ఆట కట్టిస్తున్నారు. అలాంటి ఓ ఘటనే మహారాష్ట్రలో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పోర్టు పట్టణమైన రత్నగిరి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యకులు ముంబైలోని బాంద్రాలో ఉంటున్నారు.


లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో బైక్‌పై దాదాపు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ.. పోలీసులు చెక్‌పోస్ట్‌ల దగ్గర ఆపితే ఎలా అనే సందేహం వచ్చింది. అందుకు ఓ పకడ్బందీ ప్లాన్ వేశారు. ఆంటీ చనిపోయిందని అబద్ధం చెప్పి ప్రతీ చెక్‌పోస్ట్ వద్ద తప్పించుకోవాలని నిర్ణయించుకుని బైక్‌పై బయల్దేరారు. అయితే.. ఆధారం ఏంటని పోలీసులు వీడియో కాల్ చేయమని అడిగితే వీళ్లు చెప్పేది అబద్ధం అని తెలిసిపోతుంది. అందుకూ వీళ్లు ముందుగానే ప్రిపేరయ్యారు. కుటుంబ సభ్యులను కూడా ఈ నాటకంలో భాగస్తులని చేశారు. ఓ కుటుంబంలోని మహిళ చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేశారు.


పోలీసులు వీడియో కాల్ చేయమని అడగ్గానే.. ఇంటి వద్ద ఈ సీన్ హఠాత్తుగా కనిపిస్తుంది. నిజమేనని నమ్మిన పోలీసులు వాళ్లు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. అలా.. దాదాపు సగం దూరం పోలీసులకు కుచ్చుటోపీ పెట్టి బాగానే వెళ్లిన ఈ ఇద్దరూ సరిగ్గా సొంతూరు 160 కిలోమీటర్ల దూరంలో ఉందనగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఖేడ్ పట్టణం సమీపంలో ఉన్న ఓ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వీరిని ఆపారు. ఈ పోలీసులకు సేమ్ స్టోరీని రిపీట్ చేసి చెప్పారు. అయితే.. ఎందుకో వీళ్లు చెప్పేది నమ్మబలికేలా లేదని భావించిన ఇన్‌స్పెక్టర్ సుజిత్ వాళ్ల గ్రామం సమీపంలో అందుబాటులో ఉన్న పోలీసులకు ఫోన్ చేసి.. నిజమెంత ఉందో ఇంటికెళ్లి కనుక్కోమని చెప్పారు. దీంతో.. ఆ గ్రామానికి పోలీసులు వెళ్లడంతో వీళ్ల డ్రామాకు శుభం కార్డ్ పడింది. బైక్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ 14 రోజుల క్వారంటైన్‌కు పంపారు.

Updated Date - 2020-04-15T03:20:35+05:30 IST