ఆ కళ్లద్దాలతో వెనుక రహస్యాలు బహిర్గతం!
ABN , First Publish Date - 2020-12-07T17:26:19+05:30 IST
కళ్లద్దాలు బాగుంటే చూపు బాగుంటుందని అంటారు. అయితే ఇప్పుడు...

దుర్గాపూర్: కళ్లద్దాలు బాగుంటే చూపు బాగుంటుందని అంటారు. అయితే ఇప్పుడు ఆ కళ్లద్దాలు పెట్టుకుంటే మన వెనుక ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. బెంగాల్‌లోని పూర్వ బుద్ధిమాన్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని కళ్లద్దాలతో ఎదురుగా ఉన్నదే కాదు... వెనుక ఉన్నది కూడా చూడొచ్చని నిరూపించింది. 12 వ తరగతి విద్యార్థిని దిగంతికా బోస్ ఈ విచిత్రమైన కళ్లద్దాలను తయారు చేసింది. ఈ కళ్లద్దాలు పెట్టుకుంటే ముఖాన్ని వెనక్కి తిప్పకుండానే మన వెనుక ఏమి జరుగుతోందో స్పష్టంగా చూడొచ్చు. ఈ విచిత్ర కళ్లద్దాలను తయారు చేసిన ఈ బాల మేథావి ఇప్పుడు దీనికి పేటెంట్ పొందే దిశగా ప్రయత్నిస్తోంది. దిగంతికా బోస్ ఈ కళ్లద్దాలను తయారు చేసేందుకు కేవలం 100 రూపాయలు ఖర్చు చేసింది. కళ్లద్దాలకు గల రెండు లెన్సులకు ఇరువైపులా మరో రెండు లెన్సులను అటాచ్ చేసింది.
దీని ద్వారా తలకు వెనుక భాగంలో ఏమి జరుగుతున్నదో ఆ లెన్సులలో చూసి తెలుసుకోవచ్చు. వాహనానికి ముందు భాగంలో ఉండే రెండు అద్దాల ద్వారా వెనుక వస్తున్న వాహలను చూడగలుగుతాం. సరిగ్గా ఇదే ఐడియాను దిగంతికా కళ్లద్దాలకు వర్తిపజేసింది. ఈ సందర్భంగా దిగంతికా మాట్లాడుతూ తాను కొంతకాలం క్రితం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లానని, అక్కడకు సమీపంలో పులులు సంచరిస్తున్నాయని, వెనుక నుంచి వచ్చి దాడి చేస్తున్నాయని అక్కడివారు మాట్లాడుకుంటుండగా విన్నానని, ఈ సమస్య పరిష్కారం కోసం ఆలోచించగా, తనకు ఇటువంటి ఐడియా వచ్చిందని తెలిపారు. తన నూతన ఆవిష్కరణను అందరూ మెచ్చుకుంటున్నారని దిగంతికా తెలిపారు.
