ఉద్యోగం వదలి ‘బేంబూ ఇండియా’తో రూ. 38 కోట్ల టర్న్ఓవర్!

ABN , First Publish Date - 2020-12-06T12:55:05+05:30 IST

మహారాష్ట్రలోని పూణెకు చెందిన యోగేష్ షిండే ఐటీ బేస్డ్ మల్టీ నేషనల్ కంపెనీలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్.

ఉద్యోగం వదలి ‘బేంబూ ఇండియా’తో రూ. 38 కోట్ల టర్న్ఓవర్!

పూణె: మహారాష్ట్రలోని పూణెకు చెందిన యోగేష్ షిండే ఐటీ బేస్డ్ మల్టీ నేషనల్ కంపెనీలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్. తన 14 ఏళ్ల కెరియర్‌లో ఐదేళ్లపాటు లండన్, జర్మనీ తదితర విదేశాలలో పనిచేశారు. అయితే ఒకరోజు యోగేష్ తాను తన దేశానికి ఏమిచేస్తున్నానని ఆలోచించారు. అంతే ఉన్నఫళాన ఉద్యోగం వదిలివేసి, మనదేశానికి ఉపయుక్తమయ్యే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. 2016లో యోగేష్ ‘బేంబూ ఇండియా’ను స్థాపించారు. ఈ సంస్థ నుంచి ఉత్పత్తవుతున్నవస్తువులు ప్లాస్టిక్ వినియోగాన్నివీలైనంత తక్కువ చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. ఈ సందర్భంగా యోగేష్ మాట్లాడుతూ ‘2016లో తాము ఈ కంపెనీని ప్రారంభించామని, మొదటి ఏడాది తమ టర్న్ఓవర్ రూ. 52 లక్షలు ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ టర్న్‌ఓవర్ రూ. 3.8 కోట్లకు చేరిందన్నారు. అయితే ఇదేమీ గొప్ప విషయం కాదని, తమకు ఇంకా ఉన్నత లక్ష్యాలు ఉన్నాయని అన్నారు.


ఇప్పటివరకూ తమ ఉత్పత్తుల ద్వారా 13.5 లక్షల కిలోల ప్లాస్టిక్ వేస్టేజ్ వెలువడకుండా చూడగలిగామన్నారు. తమ సంస్థకు 2,500 మంది రైతులతో కూడిన బృందం, 200కు మించిన సపోర్ట్‌స్టాఫ్ ఉన్నారన్నారు. ఇదే మా సంస్థ టర్న్‌ఓవర్ అభివృద్ధికి కారణమన్నారు. తన జీవితం మిడిల్ క్లాస్‌లో ప్రారంభమయ్యిందని, తొలుత ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ఆ తరువాత పూణె యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశానన్నారు. 14 ఏళ్ల పాటు ఐటీరంగంలో పనిచేసి, దానిని విడిచి పెట్టాక వెదురు ఉత్పత్తుల మీద అధ్యయనం చేశానని తెలిపారు. వెదురుతో వస్తు ఉత్పత్తులు సాగిస్తే విజయవంతమవుతుందని అనిపించిందన్నారు. అలాగే ఇది ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుందని ఈ ఉత్పత్తులు ప్రారంభించామన్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేయగల వస్తువులన్నింటినీ వెదురుతో తయారుచేస్తున్నామని తెలిపారు. మొదట గిఫ్టింగ్ ఐటమ్స్‌తో మొదలు పెట్టి, ఇప్పడు టూత్‌బ్రష్ వరకూ ప్రతీ వస్తువును వెదురుతో రూపొందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురు ఉత్పత్తులను వినియోగిస్తే ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టినవారవుతారన్నారు.

Updated Date - 2020-12-06T12:55:05+05:30 IST