ఏనుగు మీద యోగా చేస్తూ జారిపడ్డ బాబా రాం‌దేవ్..!

ABN , First Publish Date - 2020-10-14T03:37:38+05:30 IST

ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఏనుగు మీదకు ఎక్కి యోగా చేస్తుండగా...

ఏనుగు మీద యోగా చేస్తూ జారిపడ్డ బాబా రాం‌దేవ్..!

మథుర: ప్రముఖ యోగా గురు బాబా రాం‌దేవ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఏనుగు మీదకు ఎక్కి యోగా చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఆయన కిందపడ్డారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న ఓ ఆశ్రమానికి వెళ్లిన ఆయన అక్కడున్న వారికి యోగాసనాలు వేసి చూపించే ప్రయత్నం చేశారు. ఏనుగుపై ఎక్కి కూర్చుని పద్మాసనం వేసిన ఆయన భ్రమరీ ప్రాణాయామం చేస్తుండగా ఏనుగు ఉన్నట్టుండి కదిలింది. దీంతో.. ఏనుగుపై కూర్చున్న ఆయన అదుపు తప్పి కిందపడ్డారు.


అయితే.. కింద పడిన రాందేవ్ బాబాకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. కిందపడిన సందర్భంలో ఆయన కొంత అసహనంగా కనిపించారు. గతంలో ఓ సందర్భంలో కూడా ఆయన సైకిల్‌ తొక్కుకుంటూ మలుపు వద్ద పడిపోయారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. ప్రస్తుతం ఆయన ఏనుగుపై నుంచి పడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated Date - 2020-10-14T03:37:38+05:30 IST