భార్య కోసం చందమామపై స్థలం కొన్న భర్త

ABN , First Publish Date - 2020-12-27T16:47:04+05:30 IST

జాబిల్లి పిలచేను నిన్ను, నన్ను అంటూ ఓ వ్యక్తి తన సొంత మామ

భార్య కోసం చందమామపై స్థలం కొన్న భర్త

న్యూఢిల్లీ : చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుకుంటాము. చందమామ మన దగ్గరకు ఎలాగో రాడు. అందుకే మనమే చందమామ దగ్గరకు వెళ్తే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో ఓ వ్యక్తి చందమామపై తన సతీమణికి కానుకను ఇచ్చారు. పెళ్లి రోజున తన జీవిత భాగస్వామికి చంద్రునిపై స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు.


ధర్మేంద్ర అనిజ, సప్నా అనిజ దంపతులు డిసెంబరు 24న తమ వివాహ ఎనిమిదో వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను ఎంతగానో ప్రేమించే భార్య కోసం ఏదైనా అద్భుతమైన బహుమతి ఇవ్వాలని ధర్మేంద్ర ఆలోచించారు. 


ధర్మేంద్ర అనిజ మాట్లాడుతూ, తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన ప్రేయసికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకున్నానన్నారు. చాలా మంది ఈ భూమి మీద ఉన్న కార్లు, బంగారం వంటి వాటిని బహుమతులుగా ఇస్తూ ఉంటారని, అందువల్ల ఏదైనా ప్రత్యేకత చూపించాలని అనుకున్నానన్నారు. అందుకే చంద్రునిపై మూడెకరాల స్థలాన్ని కొన్నానని చెప్పారు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ స్థలాన్ని కొన్నానని, దీనికి అవసరమైన ప్రక్రియ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టిందని చెప్పారు. 


సప్నా అనిజ మాట్లాడుతూ, తనకు తన భర్త అనూహ్యమైన బహుమతి ఇచ్చారని చెప్పారు. ప్రపంచానికి అతీతమైన బహుమతిని తన భర్త నుంచి తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పారు. చంద్రునిపై స్థలాన్ని బహుమతిగా పొందడం తనకు చాలా సంతోషకరమని చెప్పారు. తన భర్త ఇంత గొప్ప బహుమతి తనకు ఇస్తారని ఊహించలేదన్నారు. ప్రొఫెషనల్ ఈవెంట్ ఆర్గనైజర్లతో వైభవంగా ఏర్పాట్లు చేయించి, పార్టీ ఇచ్చినట్లు తెలిపారు. నమ్మశక్యం కానటువంటి సెట్టింగ్స్ వేసినట్లు తెలిపారు. నిజంగా చంద్రునిపైనే ఉన్నామన్నంత అనుభూతి కలిగిందన్నారు.


Updated Date - 2020-12-27T16:47:04+05:30 IST