ఆన్‌లైన్‌లో ఫాలున్ దాఫా 21వ వార్షికోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2020-05-14T00:48:54+05:30 IST

భారత్‌లో ప్రపంచ ఫాలున్ దాఫా డే 21వ వార్షికోత్సవ వేడుకలు ఈ ఏడాది ఆన్‌లైన్ వేదికగా జరిగాయి....

ఆన్‌లైన్‌లో ఫాలున్ దాఫా 21వ వార్షికోత్సవ వేడుకలు

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రపంచ ఫాలున్ దాఫా డే 21వ వార్షికోత్సవ వేడుకలు ఈ ఏడాది ఆన్‌లైన్ వేదికగా జరిగాయి. దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్‌లోని ఫాలున్ దాఫా సాధకులు వీడియో కాన్ఫరెన్స్ సాయంతో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రపంచ ఫాలున్ దాఫా వార్షికోత్సవం సందర్భంగా ఏటా ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సాధన గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. 


పురాతన ఆధ్యాత్మిక జీవన విధానమైన ఫాలున్ దాఫా సాధన ద్వారా తమ జీవితాల్లో సానుకూల వెలుగులు నింపుకున్న ప్రజల్లో మే 13కు అత్యంత ప్రాశస్త్యం ఉంది. 1992లో ఇదే రోజు మాస్టర్ లీ హోంగ్జీ చైనా ప్రజలకు ఫాలున్ దాఫా పేరిట ఈ శాంతియుత జీవన విధానాన్ని పరిచయం చేశారు. దీన్ని ఫాలున్ గాంగ్ అని కూడా వ్యవహరిస్తారు. నాడు అత్యంత మారుమూల ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ సాధన... ఓ ఆధ్యాత్మిక ఉద్యమంలా రూపుదిద్దుకుని 120 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మందికి పైగా దీన్ని సాధన చేస్తున్నారు.


2000 సంవత్సరంలో ఫాలున్ దాఫా భారతదేశంలో ప్రవేశించింది. 2004 నాటికి అధికారికంగా రిజిస్టర్ అయ్యింది. అప్పటి నుంచి ఈ వ్యాయామం, ధ్యానం సాధనను దేశవ్యాప్తంగా పలు స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశపెట్టారు. ఢిల్లీ, హైదరాబాద్ పోలీస్ ఆకాడమీల్లో ఫాలున్ దాఫాకు మంచి ఆదరణ ఉంది. తమ సీనియర్ ఎగ్జిక్యుటివ్‌లకు ఈ విధానాన్ని పరిచయం చేసేందుకు అనేక సంస్థలు ఫాలున్ దాఫా సాధకులను ఆహ్వానించాయి. జైలు సూపరింటెండెంట్లు సైతం తమ ఖైదీలకు ఈ సాధన నేర్పాలంటూ కోరడం విశేషం.  

Read more