12 ఏళ్ల బాలుడు, ఏడేళ్ల బాలికను తీసుకుని.. రేంజ్ రోవర్ కారులో..
ABN , First Publish Date - 2020-12-12T00:50:24+05:30 IST
12 ఏళ్ల బాలుడు ఏడేళ్ల బాలికను తీసుకుని రేంజ్ రోవర్ కారులో 100 మైళ్లు ప్రయాణించాడు. నమ్మశక్యంగా లేదు కదూ! కట్టుకథ
న్యూయార్క్: 12 ఏళ్ల బాలుడు ఏడేళ్ల బాలికను తీసుకుని రేంజ్ రోవర్ కారులో 100 మైళ్లు ప్రయాణించాడు. నమ్మశక్యంగా లేదు కదూ! కట్టుకథ అనిపిస్తోంది కదూ! మీరు అలా అనుకోవడంలో తప్పులేదు కానీ, ఇది మాత్రం ముమ్మాటికీ నిజం. అమెరికాలో జరిగిందీ ఘటన. సోషల్ మీడియా చాలెంజ్‌లో భాగంగా వీరిలా చేసినట్టు తెలిసి అందరూ అవాక్కయ్యారు. క్వీన్స్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు తన కజిన్ అయిన ఏడేళ్ల అమ్మాయిని తీసుకుని తల్లిదండ్రుల రేంజ్ రోవర్ కారులో ఏకంగా ఐదు గంటలు ప్రయాణించి రాష్ట్ర సరిహద్దులే దాటేశాడు. న్యూయార్క్, న్యూజెర్సీ మీదుగా ప్రయాణించి డెలావర్ సరిహద్దుకు చేరుకున్నాడు.
ఒకానొక సమయంలో పోలీసులకు వారు దొరికినప్పటికీ వారు మరింత వేగంతో తప్పించుకుపోయారు. పోలీసులు బాలుడి పేరును వెల్లడించలేదు. న్యూజెర్సీ-డెలావర్ సరిహద్దు వద్ద కాసేపు ఆగిన బాలుడు తన తండ్రి క్రెడిట్ కార్డును ఉపయోగించి కుకీస్ కూడా కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ట్రిప్ సూపర్‌గా ఉందని బాలిక చెప్పడం గమనార్హం. నిజానికి కారును తాను డ్రైవ్ చేయాలనుకున్నానని చిన్నారి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. కారులో గ్యాస్ అయిపోయినంత వరకు తిరిగిన బాలుడు.. సోషల్ మీడియా చాలెంజ్‌లో భాగంగానే ఇదంతా చేసినట్టు పోలీసులకు చెప్పాడు.