2020 గురించి 10 ఏళ్ల క్రితమే చెప్పిన బాలుడు.. ఇప్పుడు వైరల్!
ABN , First Publish Date - 2020-12-30T15:58:43+05:30 IST
విష్యత్తు గురించి చాలా మంది చాలా ఊహలు చేస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం వంటివి ఇలాంటి విషయంలో టాప్. వీటిని నమ్మేవాళ్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. ప్రముఖ చిత్ర కారుడు డావిన్సీ..
ఇంటర్నెట్ డెస్క్: భవిష్యత్తు గురించి చాలా మంది చాలా ఊహలు చేస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం వంటివి ఇలాంటి విషయంలో టాప్. వీటిని నమ్మేవాళ్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. ప్రముఖ చిత్ర కారుడు డావిన్సీ.. తన చిత్రాల ద్వారా భవిష్యత్ తరాల వారికి సూచనలు చేసేవాడని, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను తన పెయింటింగుల్లో ప్రతిబింబించే వాడని కొందరు చెప్తారు. ఇలా భవిష్యత్తులో జరిగే చాలా సంఘటనలను కచ్చితంగా చెప్పిన వాళ్లు చరిత్రలో చాలా మందే ఉన్నారు. వారందరినీ మనం చాలా గౌరవిస్తాం కూడా.
ఈ ఏడాది అంటే 2020వ సంవత్సరం పూర్తయిపోతోంది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఈ సంవత్సరం గురించి ఓ బాలుడు చెప్పిన మాటలు ప్రస్తుతం ట్విట్టర్లో హాట్ టాపిక్‌గా మారాయి. పదేళ్ల క్రితం ఓ పదేళ్ల కుర్రాడు ఈ ప్రిడిక్షన్ చేశాడు. ఆ బాలుడి పేరు కెవిన్ సింగ్. తన ఇయర్ బుక్‌లో కెవిన్ రాసుకున్న కొన్ని ఊహలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ పుస్తకంలో 2020 గురించి కూడా కెవిన్ రాశాడు. ‘‘ఆ సంవత్సరం మనుషులంతా ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా బతుకుతారు. ఎటువంటి వ్యాధులనైనా దీటుగా ఎదుర్కొంటారు’’ అని కెవిన్ రాసుకున్నాడు.
ఇది కొంచెం రఫ్‌గా ఈ ఏడాది గడిచిన కాలాన్ని సూచిస్తోంది. 2020లో ఘర్షణలు ఎక్కువగా పడలేదు. క్వారంటైన్, లాక్డౌన్ కారణంగా దేశాలన్నీ చాలా ప్రశాంతంగా గడిపేశాయి. అలాగే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించడంతో దాన్ని నియంత్రించే కొత్త వ్యాక్సిన్లు తయారు చేశారు. ఇదంతా చూసిన నెటిజన్లు.. కెవిన్ అప్పట్లో అలా అనడం వల్లే ఈ సంవత్సరంలో ఇలా జరిగిందంటూ సరదాగా ఆరోపణలు చేశారు. కొందరైతే మాకు ఏదో మంచి జరుగుతుందని జ్యోతిష్యం చెప్పాలంటూ అడుగుతున్నారు. అప్పట్లో కెవిన్ ఇయర్ బుక్‌లో రాసుకున్న ఈ ప్రిడిక్షన్ ఫొటోను ఇప్పటి వరకూ 70వేల మంది ట్విట్టర్ యూజర్లు లైక్ చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయం కెవిన్‌కు తెలిసింది. దీంతో ఆశ్చర్యపోయిన కెవిన్.. అప్పట్లో అలా భవిష్యత్తు చెప్పినందుకు సారీ అంటూ జోక్ చేశాడు.