వాళ్లకు వేలిముద్రలు లేవు!
ABN , First Publish Date - 2020-12-30T06:17:45+05:30 IST
వేలిముద్రలు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు...

వేలిముద్రలు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు... ఇలా చాలా చోట్ల వేలిముద్రలు అవసరమవుతాయి. ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. అందుకే నేరస్థులను గుర్తించడంలోనూ పోలీసులకు వేలిముద్రలు ఉపయోగపడుతుంటాయి. అయితే ఒకవేళ వేలిముద్రలే లేకపోతే ఎలా? వేలిముద్రలు లేకుండా ఎవరైనా ఉంటారా? అంటే.. ఉన్నారు.
బంగ్లాదేశ్‌లోని రాజషాహి జిల్లాలో నివసించే సర్కర్ కుటుంబంలో ఎవరికీ వేలిముద్రలు లేవు. వంశపారంపర్యంగా ఇది వస్తోంది. వాళ్ల చేతులు పూర్తిగా ఎలాంటి రేఖలు లేకుండా స్మూత్‌గా ఉంటాయి.
వేలిముద్రలు లేకపోవడం వల్ల వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వేలిముద్రలు తప్పనిసరి. ‘‘డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష పాసయ్యాను. కానీ ఫింగర్‌ప్రింట్స్ లేని కారణంగా అధికారులు లైసెన్స్ జారీ చేయలేదు’’ అని అంటారు అమల్ సర్కర్.
వాళ్ల పేరుపై సిమ్‌కార్డును సైతం కొనుగోలు చేయలేకపోతున్నారు. ఆ దేశంలో సిమ్‌కార్డు కొనాలంటే ఫింగర్‌ప్రింట్స్ తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వాళ్ల అమ్మ పేరుపై సిమ్ కార్డులు తీసుకుని వాడుకుంటున్నారు.
వేలిముద్రలు లేకపోవడం చాలా అరుదైన జన్యుపరమైన సమస్య అని వైద్యులు తేల్చారు. దీన్ని అడెర్మాటోగ్లిఫియా అంటారు. కుటుంబంలో తండ్రి నుంచి వారసులకు సంక్రమిస్తూ ఉంటుంది.