ఇనుప పెట్టె!

ABN , First Publish Date - 2020-11-19T05:30:00+05:30 IST

ఒక ఊరిలో గోవిందు, పాండు అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. గోవిందు వ్యాపారం చేసే వాడు. వ్యాపారంలో నష్టం రావడంతో ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకున్నాడు. ఒక ఇనుప పెట్టె మాత్రం మిగిలింది. ఇక ఊర్లో ఉంటే తనకు వ్యాపారం కలిసి రాదని దగ్గరలో ఉన్న నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు...

ఇనుప పెట్టె!

ఒక ఊరిలో గోవిందు, పాండు అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. గోవిందు వ్యాపారం చేసే వాడు. వ్యాపారంలో నష్టం రావడంతో ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకున్నాడు. ఒక ఇనుప పెట్టె మాత్రం మిగిలింది. ఇక ఊర్లో ఉంటే తనకు వ్యాపారం కలిసి రాదని దగ్గరలో ఉన్న నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వెళుతూ వెళుతూ స్నేహితుడైన పాండును కలిసాడు. తన దగ్గర ఉన్న ఇనుప పెట్టెను మిత్రుడికిచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పాడు. అందుకు పాండు సరేనన్నాడు. నగరానికి వెళ్లి అనేక వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి తిరిగి తన ఊరొచ్చాడు.


గోవిందును చూసి పాండుకు ఈర్ష్య కలిగింది. కానీ గోవిందు మాత్రం స్నేహితుడైన పాండును ఆప్యాయంగా పలకరించాడు. ‘‘నేను వెళ్లేటప్పుడు ఇనుప పెట్టె ఇచ్చాను కదా! దాని తిరిగి ఇవ్వు’’ అని అడిగాడు. పాండుకి మాత్రం ఆ పెట్టెను తిరిగి ఇవ్వాలనిపించలేదు. దాంతో ఆ పెట్టెను ఎలుకలు తినేసాయి అని చెప్పాడు. పాండు బుద్ది గోవిందుకు అర్థమైంది. ‘‘ సరేగానీ, నేను మీ కోసం చాలా బహుమతులు తెచ్చాను. మీ అబ్బాయిని పంపించు. వాటిని ఇస్తాను’’ అని అన్నాడు గోవిందు. బహుమతుల ఆశతో పాండు తన కొడుకుని పంపించాడు. అయితే బహుమతుల కోసం వెళ్లిన పాండు కొడుకు తిరిగి ఇంటికి రాలేదు. దాంతో ఆందోళన చెందిన పాండు గోవిందు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి కొడుకు గురించి అడిగాడు. అప్పుడు గోవిందు ‘మీ కొడుకుని గద్ద ఎత్తుకుపోయింది’ అన్నాడు. పదహారేళ్ల అబ్బాయిని గద్ద ఎలా ఎత్తుకు వెళుతుంది? అని అడిగినా గోవిందు అదే సమాధానం చెప్పాడు. దాంతో పాండు ఊరి పెద్దను ఆశ్రయించాడు. అక్కడ కూడా గోవిందు అదే మాట చెప్పాడు. ఊరి పెద్ద కోపంతో అబ్బాయిని గద్ద ఎలా ఎత్తుకు పోతుంది? అని ప్రశ్నించాడు. ‘‘ఇనుపపెట్టెను ఎలుకలు ఎలా తిన్నాయో, అలాగే వాళ్ల అబ్బాయిని గద్ద ఎత్తుకువెళ్లింది’’ అని చెప్పాడు. దాంతో విషయం అర్థమయిన ఊరి పెద్ద ఇనుప పెట్టెను తిరిగి ఇవ్వాల్సిందిగా పాండుకు చెప్పాడు. పాండు ఇనుప పెట్టె తెచ్చి ఇవ్వడంతో, గోవిందు పాండు కొడుకును అప్పగించాడు.

Updated Date - 2020-11-19T05:30:00+05:30 IST