మామిడి... ఎంత తినాలి?

ABN , First Publish Date - 2020-06-06T05:30:00+05:30 IST

మామిడి... ఎంత తినాలి?

మామిడి... ఎంత తినాలి?

నాకు ఆవకాయ, మామిడి పండ్లంటే చాలా ఇష్టం. తినొద్దు అనుకున్నా తినేస్తుంటా. నాకు బీపీ, షుగర్‌ ఉంది. ఈ సీజన్‌లో నేను పడే కష్టం అంతాఇంతా కాదు. బీపీ ఉన్నవారు అవకాయ పచ్చడి తినకూడదని, షుగర్‌ ఉంటే మామిడి పండ్లు తినొద్దని ఇంట్లో నన్ను కట్టడి చేస్తున్నారు. దయచేసి అసలు వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలో చెప్పండి.

రాధ, కాకినాడ

ఈ సీజన్‌లో అందరూ ఇష్టపడేది ఆవకాయ అన్నం, మామిడి పండ్ల రసం. మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే... ఏ ఆహారమైనా అతిగా తినకూడదు. అవి ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా లిమిట్‌లో ఉండటం శ్రేయస్కరం. మామిడి విషయంలో కూడా అంతే. మీకు బీపీ, షుగర్‌ ఉండటంతో వాటిని తినకూడదనే మూఢనమ్మకం వల్ల మీకు వాటిపై ఆసక్తి మరింత ఎక్కువై తినాలనిపిస్తోంది.


బీపీ, షుగర్‌ ఉన్నవారు

బీపీ ఉన్నవారు రోజుకు ఒక్క ఆవకాయ ముక్కకన్నా ఎక్కువ తినొద్దు. గ్రేవీ వీలైనంత తక్కువ తినాలి. ఆవకాయలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉప్పు సెన్సిటివ్‌, బీపీ ఉన్నవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్త పాటించాలి. అలాగే షుగర్‌ ఉన్నవారు కూడా ఒక్క ముక్కకన్నా ఎక్కువ తీసుకోవద్దు. నూనె శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పచ్చడైనా సరే ఒక స్పూను కన్నా ఎక్కువ తినరాదు.  ఇక మామిడిపండ్ల విషయానికొస్తే బీపీ ఉన్నవారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ షుగర్‌ ఉన్నవారు మోతాదు పాటించాలి. అయితే మానేయడమే మంచిది ఈ మాత్రం దానికి అని కొందరు వాపోతారు కూడా. అందుకే షుగర్‌ ఉన్నవారు మామిడిపండును స్నాక్‌లాగా తీసుకోవాలి.


అంటే సాయంత్రం 5 గంటల సమయంలో 250 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇదే భోజనంతో పాటు తీసుకోవాలంటే, అన్నం కొంత  తగ్గించి దాని బదులుగా మామిడి పండు తినొచ్చు. చాలామంది పెరుగన్నంలో మామిడి పండు తింటారు. వారు కూరన్నం మానేసి కేవలం పెరుగన్నం మామిడి పండు కాంబినేషన్‌లో తీసుకోవాలి. ఇలా ఆహార ప్రణాళిక మార్చుకుంటూ మామిడిపండ్లు తీసుకుంటే షుగర్‌ కూడా పెరగకుండా చూసుకోవచ్చు. 


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com 

Updated Date - 2020-06-06T05:30:00+05:30 IST