‘డబుల్‌ చిన్‌’ బాధ పోవాలంటే...

ABN , First Publish Date - 2020-07-27T08:48:08+05:30 IST

వయసు వల్ల, శరీరం లావుగా ఉండడం వల్ల కొందరిలో ‘డబుల్‌ చిన్‌’ చూస్తుంటాం. ఇది ముఖం అందాన్ని తగ్గిస్తుంది.

‘డబుల్‌ చిన్‌’ బాధ పోవాలంటే...

వయసు వల్ల, శరీరం లావుగా ఉండడం వల్ల కొందరిలో ‘డబుల్‌ చిన్‌’ చూస్తుంటాం. ఇది ముఖం అందాన్ని తగ్గిస్తుంది. అసలు వయసుకన్నా కూడా పెద్దవారిలా కనిపిస్తారు. ‘డబుల్‌ చిన్‌’ తగ్గించుకునేందుకు బొటాక్స్‌, ఇతర కాస్మొటిక్‌ చికిత్సలకు బదులు... ఐదు రకాల తేలికైన వ్యాయామాలు రెండు వారాల పాటు చేస్తే అందమైన ‘జా లైన్‌’ మీ సొంతమవుతుంది. 


ఫిష్‌ ఫేస్‌: 

ఈ వ్యాయామంలో రెండు బుగ్గలను లోపలికి లాగి 20 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ఇలా ఐదు లేదా ఆరు సార్లు చేయాలి. ఏదైనా పనిచేసేటప్పుడు, స్నేహితులతో గడిపేటప్పుడు సైతం ఈ వ్యాయామం చేసుకోవచ్చు. 


స్కిప్పింగ్‌ రోప్‌:

డబుల్‌ చిన్‌ తగ్గించుకోవడానికి స్కిప్పింగ్‌ రోప్‌ మంచి వ్యాయామం. తాడు పట్టుకుని ఎగిరిటేప్పుడు ముఖమంతా కదులుతుంది. అలా ముఖానికి బాగా వ్యాయామం అవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం 12 వారాలు ఆపకుండా స్కిప్పింగ్‌ చేయడం వల్ల శరీర బరువులో మార్పు రావడమే గాక ముఖంలో కూడా మార్పు వస్తుందని తేలింది. 


చిన్‌ టచ్‌: 

ఈ వ్యాయామం గడ్డం కింద ప్రదేశంలో బాగా ఒత్తిడి తెస్తుంది. ముఖం కింద గడ్డాన్ని తగిలేలా నాలుకను సాధ్యమైనంత వరకు బయటకు తీసుకురావాలి. ఇది కష్టమే కానీ ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. నాలుక గడ్డానికి తగలక పోయినప్పటికీ ఆ పొజిషన్‌లో పది సెకన్ల పాటు అలాగే ఉండి ఆ తర్వాత రిలాక్స్‌ కావాలి. ఇలా పది లేదా పదిహేనుసార్లు చేయాలి.


నెక్‌ రోల్స్‌:

చాలామంది మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. అందువల్లే మెడ కింద భాగంలో ‘డబుల్‌ చిన్‌’ సమస్య తలెత్తుతుంది. నెక్‌ రోల్స్‌ వ్యాయామానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఈ ఎక్సర్‌సైజ్‌ ఎక్కడైనా, ఎప్పుడైనా చేయొచ్చు. మెడను అటు ఇటు మెల్లగా కదిలించాలి. మెడను కుడి, ఎడమవైపు, పైకి, కిందకు మెల్లగా తిప్పుతూ ఈ వ్యాయామం చేయాలి. వేగంగా చేస్తే మెడ కండరాలు పట్టేస్తాయి. కాబట్టి ఈ వ్యాయామం జాగ్రత్తగా చేయాలి. టెక్స్ట్‌ నెక్‌ సిండ్రోమ్‌, సర్వికల్‌ సమస్యల బాధలను కూడా ఈ ఎక్సర్‌సైజ్‌ తగ్గిస్తుంది.  


జా జట్‌: 

ముఖం కింద ఉన్న కండరాలను నియంత్రించడంలో ఈ వ్యాయామం బాగా పనిచేస్తుంది. జా జట్‌ వ్యాయామం చేయాలంటే మొదట తలను పైకెత్తి రూఫ్‌ వైపు చూడాలి. తర్వాత కింది దవడను ముందుకు, వెనక్కి కదిలించాలి. దవడ భాగాన్ని రెండు సెకన్ల పాటు పట్టుకుని గడ్డం ఉన్న భాగాన్ని ముందుకు స్ట్రెచ్‌ అండ్‌ టోన్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బాగా ముందుకు కదులుతాయి. టోనింగ్‌ కూడా బాగా అవుతుంది.

Updated Date - 2020-07-27T08:48:08+05:30 IST