‘లాక్‌డౌన్‌’ వేళలో...!

ABN , First Publish Date - 2020-03-28T05:44:55+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తితో, దేశమంతా లాక్‌డౌన్‌ అయిన సమయం ఇది. ఈ పరిస్థితుల్లో అందరూ తప్పనిసరిగా ఇంట్లోనే ఆహారం వండుకోవాలి. అయితే, ఆ ఆహారం రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా ఉంటే...

‘లాక్‌డౌన్‌’ వేళలో...!

కరోనా వైరస్‌ వ్యాప్తితో, దేశమంతా లాక్‌డౌన్‌ అయిన సమయం ఇది. ఈ పరిస్థితుల్లో అందరూ తప్పనిసరిగా ఇంట్లోనే ఆహారం వండుకోవాలి. అయితే, ఆ ఆహారం రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా ఉంటే, ఇంట్లో అందరికీ బాగుంటుంది. ఒకవైపు ఆకలి తీరుస్తూనే, మరోపక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చులో అయిపోయేదిగా ఉండాలి. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో రోగ నిరోధకశక్తి పెంచేదిగా ఉండడం మరీ అవసరం. 


కుటుంబం మొత్తం రోజంతా ఇంటికే పరిమితమైన ఈ పరిస్థితుల్లో... బలవర్ధకమైన ఆహారం వండుకోవడం, తినడం, ఒక ప్రణాళికగా బద్ధంగా వ్యాయామం చేయడం కీలకం. అలా చేస్తే ఒక పక్క ఆరోగ్యం బలపడుతుంది. మరోపక్క శారీరకంగా, మానసికంగా తృప్తి కూడా అనిపిస్తుంది. ఇంటిపనులు చేస్తూనే, ఇలాంటివన్నీ పూర్తి చేసుకోవడం వల్ల ఇంటితో పాటు మీరూ కళకళలాడుతుంటారు. 


లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో... మీ ఆహారం, ఇంట్లోనే మీ విహారం ఎలా ఉండాలన్నదానికి ఒక ప్లాన్‌ ఇది...

ఉదయం 6 గంటలకు: సూర్యనమస్కారం చేయండి. వయసు, శారీరక ఆరోగ్యాన్ని బట్టి మీకు ఎలా వీలుంటే అలా చెయ్యండి. వయోవృద్ధులు కుర్చీలో కూర్చొని కూడా ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడి నమస్కారం చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు రెగ్యులర్‌ సూర్య నమస్కారం చేసుకోవచ్చు. అది కూడా వీలుకాని వాళ్ళు ఇంట్లోనే కొద్దిసేపు అటూ ఇటూ నడవాలి. ఎంత స్పీడుగా వీలైతే... అంత స్పీడుగా నడవడం మంచిది. 


ఉదయం 6.30 గంటలకు: మంచి నీళ్ళు, నానబెట్టిన బాదాములు అయిదు, లేదంటే డ్రైఫ్రూట్లు 


7 గంటలకు: బ్లాక్‌ టీ, లేదంటే బ్లాక్‌ కాఫీ. స్నానం ఇత్యాదులు ముగించుకొని, బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ చేసుకోండి. 


8 గంటలకు: ఇడ్లీ, వేరుసెనగ పొడి, నెయ్యి కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గా తినవచ్చు. లేదంటే పొంగల్‌ + నెయ్యి తినవచ్చు. తరువాత అవసరమైన ఫోన్‌ కాల్స్‌ చేసుకోవడం, ఇతర పనులు, ఇంటి సభ్యులతో మాట్లాడుకోవడం వగైరా చేసుకోవచ్చు. 


11 గంటలకు: పచ్చి మిర్చి, అల్లం, ఉప్పు వేసిన మజ్జిగ తీసుకోవాలి. లేదంటే శొంఠి, మిరియాలు, బెల్లం కలిపిన మజ్జిగ అయినా బాగుంటుంది. ఇతర పనులు, వంట పని... 


మధ్యాహ్నం 1 గంటకు: అన్నం + సాంబార్‌ + పెరుగు + పొడి కానీ, రోటి పచ్చడి కానీ + నెయ్యితో భోజనం. లేదంటే పొంగలి + పొడి + నెయ్యి + మజ్జిగతో అయినా ఓకె. తరువాత కాసేపు ఇల్లు చక్కబెట్టుకొని, ఇరవై నిమిషాల సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. 


మధ్యాహ్నం 3 గంటలకు: పండ్లు, లేక వేరుసెనగ పప్పుండలు, లేక  రాగి జావ, లేక నువ్వుల ఉండలు తీసుకోవచ్చు. ఆ వెంటనే మళ్ళీ పనులు మొదలు పెట్టుకోవాలి. రోజుకు ఒక గది వంతున డీప్‌ క్లీనింగ్‌ చేసుకోండి. 


సాయంత్రం 5 గంటలకు: ఇంటిలో నడవాలి. ఉదయం, సాయంత్రం కలిపి రోజుకు కనీసం పది వేల అడుగులు నడిచేలా చూసుకోండి. పిల్లలైతే యోగాసనాలు, సరదా గోడ కుర్చీలు వేయడం, శీర్షాసనం వేయడం, బంతి ఆట, కుంటాట లాంటివి చేయవచ్చు. పిల్లలతో పాటు సరదాగా పెద్దలు కూడా అందులో పాల్గొనవచ్చు. 


సాయంత్రం 6 గంటలకు: ఫ్రెష్‌గా రెడీ అయ్యి, టీ లేదా కాఫీ లేదా పండ్ల రసం, లేదా మజ్జిగ, లేదా జావ తీసుకోండి. పిల్లలకు గుగ్గిళ్ళు పెట్టవచ్చు. తరవాత వంట పనిలోకి దిగండి. 


రాత్రి 8 గంటలకు: జొన్న రొట్టె, దానిలోకి వంకాయ లాంటి ఏదైనా వెజిటబుల్‌ పచ్చడి, లేదా ఏదైనా కూర, లేదంటే రాగి ముద్ద తీసుకోవచ్చు. వాటితో పాటు రసం కూడా తీసుకోవచ్చు. లేదంటే సింపుల్‌ గా చారు అన్నం కానీ, సాంబార్‌ రైస్‌ కానీ, పెరుగన్నం కానీ తినవచ్చు. 


రాత్రి 9 గంటలకు: పసుపు, శొంఠి, బెల్లం కలిపిన పాలు తాగవచ్చు. లేదంటే పాలు, శొంఠి, పసుపు, బెల్లం కలిపి బియ్యప్పిండితో చేసిన లడ్డూ తీసుకోవచ్చు.డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com

Updated Date - 2020-03-28T05:44:55+05:30 IST