ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో పిటిషన్..

ABN , First Publish Date - 2020-07-19T02:59:13+05:30 IST

కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ ఫైనలియర్ పరీక్షలను..

ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో పిటిషన్..

న్యూఢిల్లీ: కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ ఫైనలియర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే నేతృత్వంలోని శివసేన యువజన విభాగం ‘యువసేన’ ఈ పిటిషన్ దాఖలుచేసింది. తమ పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినట్టు  యువసేన సెక్రటరీ వరుణ్ సర్దేశాయ్ వెల్లడించారు. పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాలు తగిన నిర్ణయాలు తీసుకునే విధంగా అనుమతించాలని యువసేన డిమాండ్ చేసింది. కాగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. చాలా రాష్ట్రాలు, నగరాలు మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. ఎక్కవ మంది గుమిగూడవద్దని డబ్ల్యూహెచ్‌వో కూడా చెబుతోంది. మహారాష్ట్రతో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో ఫైనలియర్ పరీక్షలను రద్దు చేశారు. అయినప్పటికీ ఫైనలియర్ పరీక్షలను నిర్వహించాల్సిందేనంటూ యూజీసీ ఆదేశించింది. 10 లక్షల మంది విద్యార్ధులున్న మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొవిడ్-19 ఆంక్షల నడుమ పరీక్షలను నిర్వహించడం అసాధ్యం...’’ అని యువసేన తన పిటిషన్‌లో పేర్కొంది.


పరీక్షలను రద్దు అంశాన్ని లేవనెత్తాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల నుంచి తమకు విజ్ఞప్తులు అందాయని వరుణ్ సర్దేశాయ్ వెల్లడించారు. ఆన్‌లైన్ క్యాంపైన్ ద్వారా పరీక్షల రద్దు కోరుతూ 2 లక్షల మందికి పైగా విద్యార్ధులు సంతకాలు చేసినట్టు ఆయన తెలిపారు. ఇదే అంశంపై ఆదిత్య థాకరే నేతృత్వంలో తాము యూజీసీ, కేంద్ర మానవ వనరుల శాఖలకు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందనా లేదని ఆయన అన్నారు. 

Updated Date - 2020-07-19T02:59:13+05:30 IST