జపాన్ ప్రధానిగా సుగా ఎన్నిక!
ABN , First Publish Date - 2020-09-16T17:17:07+05:30 IST
జపాన్ నూతన ప్రధానిగా యొషిహిడే సుగా బుధవారం నాడు ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ డైట్‌లో జరిగిన ఎన్నికలో ఆయన గెలుపొందారు.

టోక్యో: జపాన్ నూతన ప్రధానిగా యొషిహిడే సుగా బుధవారం నాడు ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ డైట్‌లో జరిగిన ఎన్నికలో ఆయన గెలుపొందారు. అనారోగ్య కారణాల రీత్యా మునుపటి ప్రధాని షింజో అబే తన పదవికి రాజీనామా చేయడంతో.. యొషిహిడే ఈ బాధ్యతలు చేపట్టారు. సోమవారం నాడు అధికార పార్టీ ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవడంతో ప్రధానిగా ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే అయ్యింది. మరి కాసేపట్లో సుగా తన క్యాబినెట్ సభ్యుల పేర్లను కూడా ప్రకటించనున్నారు.
షింజో అబే హయాంలో సుగా క్యాబినెట్ సెక్రెటరీగా సేవలందించారు. అబేకు నమ్మకస్థుడిగా, కూడి భుజంగా పేరుపొందారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుగా.. రాజకీయాల్లో కింద స్థాయి నుంచి ప్రారంభించి క్రమంగా ఉన్నతస్థితికి చేరుకున్నారు. తన సామాన్య నేపథ్యం కారణంగా సామన్యులకు, గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే దృక్పథం తనకు అలవడిందని సుగా తరచూ చెబుతుంటారు.
కాగా.. జపాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుగాకు భారత్ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సారథ్యంలో భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన జపనీస్ భాషలో ట్వీట్ చేశారు.