యువతకూ రక్షణ లేదు
ABN , First Publish Date - 2020-04-05T09:20:01+05:30 IST
యువతా జరభద్రం!! కరోనా ఇన్ఫెక్షన్ల ట్రెండ్ మారుతోంది. వృద్ధులు, వివిధవ్యాధులతో బాధపడుతున్న వారికే కొవిడ్-19 ముప్పు ఎక్కువనే వాదనను తలకిందులు చేసే దిశగా కేసులు నమోదవుతున్నాయి.

- వారికీ కరోనా ముప్పు...
- కేంద్ర ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో
హైదరాబాద్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): యువతా జరభద్రం!! కరోనా ఇన్ఫెక్షన్ల ట్రెండ్ మారుతోంది. వృద్ధులు, వివిధవ్యాధులతో బాధపడుతున్న వారికే కొవిడ్-19 ముప్పు ఎక్కువనే వాదనను తలకిందులు చేసే దిశగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బారినపడుతున్న వారిలో 83% మంది 50 ఏళ్లలోపువారేనని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. భారత్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 41.88% మంది 21-40 ఏళ్ల వారేనని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో 41-60 ఏళ్లవారు(32.82%), 60 ఏళ్లకు పైబడినవారు(16.69%), 20 ఏళ్లలోపువారు(8.61%) ఉన్నట్లు తెలిపింది. ఈ గణాంకాలకు బలాన్ని చేకూర్చేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీ ప్రోగ్రామ్స్ కార్యనిర్వాహక డైరెక్టర్ మైక్ ర్యాన్ జెనీవాలో ఓ ప్రకటన చేశారు. వివిధ దేశాల్లో 30, 40, 50 ఏళ్లవారు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండానే ఆస్పత్రుల్లో చేరి కరోనాతో మృతి చెందుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బ్రిటన్‌లో 13 ఏళ్ల బాలుడు, 21ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందిన ఘటనలను ర్యాన్ గుర్తుచేశారు. గత 6 వారాల్లో ఇటలీలోని ఆస్పత్రుల ఐసీయూల్లో కరోనాతో చేరినవారిలో 15ుమంది 50 ఏళ్లలోపు వారేనని తెలిపారు. దక్షిణ కొరియాలో కొవిడ్-19తో మృతిచెందుతున్న ప్రతీ ఆరుగురిలో ఒకరు 60 ఏళ్లలోపు వారేనన్నారు. ఈ పరిస్థితుల్లో యువత అప్రమత్తతతో వ్యవహరించాలని, నిర్లక్ష్యంగాఉంటే పరిస్థితి చేయిదాటే అవకాశాలున్నాయని హెచ్చరించారు.