యోగీ వర్సెస్ కేజ్రీ: కరోనాపై ట్వీట్ల యుద్ధం!
ABN , First Publish Date - 2020-12-17T13:55:38+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా భయపెడుతుందో..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా భయపెడుతుందో వేరే చెప్పక్కర్లేదు. దీని ధాటికి అగ్రరాజ్యం అమెరికా కూడా అల్లాడుతోంది. మన భారతదేశంలో కూడా పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ మహమ్మారి విలయ తాండవమే చేసిందని చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వైరస్‌ను నియంత్రించడంలో ఎవరు బాగా పని చేశారనే ప్రశ్న దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య కరోనా నియంత్రణ మీదనే ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. దీనంతటికీ ఆజ్యం పోసింది మాత్రం కేజ్రీ చేసిన ఓ ప్రకటనే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లలో 62 స్థానాలు గెలిచి ఊపుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్, హరియాణాతోపాటు ఇటీవలే గోవాలో కూడా తన ఉనికిని చాటుకుంటోంది. దీంతో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఇటీవలే ఓ ప్రకటన చేశారు. 2022లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ కూడా పోటీ చేస్తుందని కేజ్రీ స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ చూపు ఢిల్లీ పీఠంపై ఉన్న కేజ్రీ సర్కారుపై పడింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో విద్యావిధానం సరిగాలేదంటూ ఇటీవలే యూపీ మంత్రి ఆరోపించారు. దీనికి బదులు వచ్చేలోగానే సీఎం యోగి కూడా కేజ్రీని టార్గెట్ చేశారు. ‘‘దేశంలో అత్యధిక జనాభా ఉంది యూపీలోనే. అయినా సరే కరోనా నియంత్రణలో మేమే బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాం. రెండు నెలల క్రితం ఇక్కడ 68వేల కరోనా కేసులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కేవలం 18వేలే ఉన్నాయి. యూపీలోనే అత్యధిక కరోనా టెస్టులు నిర్వహించామన్న విషయం మర్చిపోకూడదు. తక్కువ పాజిటివ్ కేసులు, తక్కువ మరణాలు నమోదైంది మా రాష్ట్రంలోనే’’ అని యోగి అన్నారట.
అంతే కాదండోయ్.. ‘యూపీ జనాభా 24 కోట్లు. ఇక్కడ కేవలం 8వేల మంది మాత్రమే కరోనాకు బలయ్యారు. కానీ కేవలం 1.75 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో 10వేల మందిపైగా మృత్యువాత పడ్డారు’’ అని ఢిల్లీ సర్కారును యోగి దుయ్యబట్టారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఘాటుగానే స్పందించారు. ‘‘యోగిజీ.. కరోనా నియంత్రణ కోసం మేం తీసుకున్న చర్యలు, నిబంధనలు అన్నింటినీ యూపీ ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు. యూపీలో రోడ్లు, బస్తీల్లో కూడా మాపై ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీలా మేం నకిలీ కరోనా టెస్టులె ఎక్కడా చేయడం లేదు’’ అని చురకలు వేశారు. దీనిపై ఇంకా యోగి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
- పి.ఫణీంద్ర