కరోనా ఉన్నా... నవమి మేళా నిర్వహించనున్న యోగి సర్కారు

ABN , First Publish Date - 2020-03-19T22:13:10+05:30 IST

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభించడంతో ప్రజలు సామూహికంగా గుమిగూడటంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా

కరోనా ఉన్నా... నవమి మేళా నిర్వహించనున్న యోగి సర్కారు

లక్నో : కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభించడంతో ప్రజలు సామూహికంగా గుమిగూడటంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా నిషేధం విధించాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా యూపీలో దాదాపు దీనినే ఫాలో అయిపోయింది. అయితే శ్రీరామ నవమి ఉత్సవాలను మాత్రం ఘనంగా నిర్వహించేందుకు యోగి సర్కారు కృత నిశ్చయంతో ఉంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా 50 మంది కంటే అధికంగా గుమిగూడదని స్వయంగా యోగి సర్కారు ఆదేశాలు జారీ చేసినా కూడా మార్చి 25 న ‘శ్రీ రామ నవమి మేళా’ ను నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తోంది.


అయోధ్యలో రామ మందిరానికి అనుకూలంగా సుప్రీం తీర్పు ఇవ్వడంతో ఈసారి రామ నవమిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ కూడా పెద్ద పెద్ద సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి దూరంగా ఉంది. అయితే రామ నవమి రోజున మాత్రం పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించబోమనీ, అన్ని వీధుల్లో మాత్రం చిన్న చిన్న సమావేశాలు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ నేత అంబరీశ్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో రామ జన్మభూమి ఉద్యమం గురించి, కరసేవ గురించి ప్రజలకు గుర్తు చేస్తామని తెలిపారు.


అంతేకాకుండా అన్ని గ్రామాల్లో కూడా కాషాయ జెండాలను ఎగురవేస్తామని, రామ నవమి ఉత్సవాన్ని ప్రజలు జరిపేలా చూస్తామని ప్రకటించారు. అయితే ఈ ఉత్సవాలపై యూపీ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. భారీ ర్యాలీలకు, సమావేశాలకు అనుమతి ఇవ్వొద్దంటూ సీఎం యోగి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఈసారి రామనవమి ఉత్సవాలకు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-19T22:13:10+05:30 IST