ప్రతిపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-12-18T01:27:52+05:30 IST
ప్రతిపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమం మాటున ప్రతిపక్షాలు

బరేలీ: ప్రతిపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమం మాటున ప్రతిపక్షాలు దేశంలో అశాంతిని రేకెత్తిస్తున్నాయని మండిపడ్డారు. అంతేకాదు, అయోధ్య రామమందిర నిర్మాణంపై ఉన్న కోపాన్ని రైతుల ఆందోళన మాటన తీర్చుకుంటున్నాయని ఆరోపించారు. ‘‘దేశం ఏక్ భారత్ అవడం, శ్రేష్ట భారత్ కావడం ఇష్టం లేని వాళ్లు అసూయతో రగిలిపోతున్నారు. రైతుల ధర్నాలో నేను దానిని చూశాను. మొదట వారు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఎక్కడ ఉందో చెప్పాలి’’ అని పశ్చిమ యూపీలోని బరేలీ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు.
‘‘ఎంఎస్‌పీపై వెనక్కి తగ్గబోమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు వారిని (రైతులను) ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి కోపానికి కారణం అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుండడమే. రామ మందిర నిర్మాణాన్ని మోదీ ప్రారంభించడమే ఇందుకు కారణం’’ అని యోగి చెప్పుకొచ్చారు. రైతులకు సాయం చేసేందుకు ప్రధాని మోదీ అద్భుతమైన ప్రయత్నాలు చేస్తున్నారని కొనియాడారు. కమ్యూనిజంలో ఎప్పుడూ నిజం లేదన్న యోగి.. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజం అయిపోతుందని, రైతుల జీవితాలు బాగుపడడం ఇష్టం లేనివాళ్లే అక్కడున్నారని యోగి ధ్వజమెత్తారు.