కోవిడ్-19 : రోజు కూలీలకు రూ.1,000 చొప్పున విడుదల చేసిన యోగి ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-03-25T00:06:33+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్-19 మహమ్మారి బాధలు పెరుగుతుండటంతో రోజు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది. దాదాపు 20 లక్షల మంది రోజువారీ వేతన కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ.1,000 చొప్పున జమ చేసింది.

కోవిడ్-19 : రోజు కూలీలకు రూ.1,000 చొప్పున విడుదల చేసిన యోగి ప్రభుత్వం

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్-19 మహమ్మారి బాధలు పెరుగుతుండటంతో రోజు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది. దాదాపు 20 లక్షల మంది రోజువారీ వేతన కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ.1,000 చొప్పున జమ చేసింది. ‘శ్రామిక్ భరణ్ - పోషణ్ యోజన’ పథకం క్రింద డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ (డీబీటీ) ద్వారా ఈ సొమ్మును జమ చేసింది. అవ్యవస్థీకృత రంగంలోని పేదలకు చేయూతనిచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.


కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతిష్టంభన సమయంలో రోజువారీ కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు తన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. డీబీటీ ద్వారా సుమారు 35 లక్షల మందికి ఈ విధంగా చేయూతనిస్తామన్నారు. వీథుల్లో సంచరిస్తూ వస్తువులు అమ్ముకునేవారు, రిక్షా కార్మికులు, ఈ-రిక్షా డ్రైవర్లు, కూలీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నలుగురు కార్మికులకు రూ.1,000 విలువైన చెక్కులను అందజేశారు. 


కార్మిక సుంకం నుంచి ఈ సొమ్మును తీసుకుని పంపిణీ చేసేందుకు పట్టణాభివృద్ధి శాఖకు అధికారం కల్పించారు. 


కోవిడ్-19 విస్తరిస్తున్నందువల్ల అష్టదిగ్బంధనం విధించడంతో రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా దెబ్బతినడంతో ఆహార పదార్థాలు కొనుక్కోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటివారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా, రేషన్ సరుకుల రూపంలో సహాయపడుతున్నాయి.


Read more