బెంగళూరులో లాక్‌డౌన్ విధింపుపై సీఎం యడియూరప్ప కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-06-27T00:34:43+05:30 IST

లాక్‌డౌన్ నిబంధనలను పాటించకపోతే బెంగళూరులో తిరిగి లాక్‌డౌన్ విధిస్తామని హెచ్చరించిన సీఎం

బెంగళూరులో లాక్‌డౌన్ విధింపుపై సీఎం యడియూరప్ప కీలక ప్రకటన

బెంగళూరు : లాక్‌డౌన్ నిబంధనలను పాటించకపోతే బెంగళూరులో తిరిగి లాక్‌డౌన్ విధిస్తామని హెచ్చరించిన సీఎం యడియూరప్ప శుక్రవారం వెనక్కి తగ్గారు. కరోనాను నియంత్రించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఏమాత్రం లేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరుగులు పెట్టించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.


దేశం మొత్తంలోనే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం ఓ నమూనాగా ఉన్నప్పటికీ, కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తే కరోనా మహమ్మారిని జయించవచ్చని ఆయన పిలుపునిచ్చారు.


‘‘అన్ని జిల్లాలతో పోలిస్తే బెంగళూరులో కేసులు ఎక్కువ. ఏ కోశానా లాక్‌డౌన్ విధించే ఉద్దేశం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ నడుస్తోంది. ఆ ప్రదేశాల్లో తప్పించి... మరెక్కడా లాక్‌డౌన్ విధించం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కూడా అత్యవసరం కదా...’’ అని స్పష్టం చేశారు.ప్రస్తుత పరిస్ధితిపై అన్ని పార్టీల ప్రతినిధులతో మాట్లాడామని, అందరమూ కలిసి కోరనా నియంత్రణకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.


కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప బెంగళూరు ప్రజలకు గురువారం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కోవిడ్‌ను నియంత్రించే చర్యలను అందరూ పాటించాలని, లేదంటే మాత్రం బెంగళూరులో మరో లాక్‌డౌన్ తప్పదని ఆయన సీరియస్‌గా హెచ్చరించారు. ప్రజలందరూ మరో లాక్‌డౌన్ ఉండకూడదన్న నిర్ణయం తీసుకుంటే మాత్రం... కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని సున్నితంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. 

 

Updated Date - 2020-06-27T00:34:43+05:30 IST