‘ఆక్స్‌ఫర్డ్‌’ బాటలో.. ‘వూహాన్‌’ వ్యాక్సిన్‌!!

ABN , First Publish Date - 2020-07-22T07:07:35+05:30 IST

ఓ వైపు ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఆశలు రేకెత్తిస్తుంటే.. మరోవైపు వూహాన్‌ వ్యాక్సిన్‌ కూడా అదే విధమైన సానుకూల ఫలితాలను ఇచ్చింది. అది సురక్షితమైందని, కొవిడ్‌-19 వైర్‌సను ఎదుర్కొనేలా రోగ నిరోధక వ్యవస్థను...

‘ఆక్స్‌ఫర్డ్‌’ బాటలో.. ‘వూహాన్‌’ వ్యాక్సిన్‌!!

  • రెండోదశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు
  • ‘లాన్సెట్‌’ జర్నల్‌లో క్యాన్‌సీనో బయోటెక్‌ నివేదిక 

బీజింగ్‌, జూలై 21 : ఓ వైపు ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఆశలు రేకెత్తిస్తుంటే.. మరోవైపు వూహాన్‌ వ్యాక్సిన్‌ కూడా అదే విధమైన సానుకూల ఫలితాలను ఇచ్చింది. అది సురక్షితమైందని, కొవిడ్‌-19 వైర్‌సను ఎదుర్కొనేలా రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయగలుగుతోందని రెండోదశ ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది. ఈమేరకు వివరాలతో ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ఓ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. దీని ప్రకారం.. చైనాలోని క్యాన్‌సీనో బయోటెక్‌ కంపెనీ అభివృద్ధిచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రెండోదశ ప్రయోగాల్లో భాగంగా వూహాన్‌లో 508 మంది వలంటీర్లపై పరీక్షించారు.


బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ రూపొందించిన వ్యాక్సిన్‌ తరహాలో ఇది కూడా వెక్టర్‌ రకానికి చెందిందే. వెక్టర్‌ అంటే వాహకం. మనుషుల్లో సాధారణ జలుబుకు కారణమయ్యే అడినోవైర్‌స(ఏడీ5)ను బలహీనపరిచి వాహకంగా వాడారు. అందులోకి కరోనా వైర్‌సకు ఆయువుపట్టులాంటి స్పైక్‌ ప్రొటీన్‌లోని జన్యుపదార్థాన్ని చొప్పించారు. అలా ఏర్పడిన మిశ్రమ పదార్థాల్ని వ్యాక్సిన్‌ ద్వారా వలంటీర్ల శరీరంలోకి ప్రవేశపెట్టారు. ఇవి రక్త ప్రవాహంలో కలిసిపోయి శోషరస గ్రంధుల(లింప్‌ నోడ్స్‌) వద్దకు చేరేసరికి.. రోగ నిరోధక వ్యవస్థ అప్రమత్తమై వైర్‌సపై దాడికి ప్రతిరక్షకాల(యాంటీబాడీ)ను విడుదల చేశాయి. మొత్తం 508 మంది వలంటీర్లలో 253 మందికి హై డోసు, 129 మందికి లో డోసు, 126 మంది ప్లేస్‌బో (డమ్మీ) చికిత్స అందించారు. హై డోసు గ్రూపులోని 95 శాతం (241/253) మందిలో, లో డోసు గ్రూపులోని 91 శాతం (118/129) మందిలో వ్యాక్సిన్‌ ఇచ్చిన 28 రోజుల తర్వాత ప్రతిరక్షకాలు, టీ-సెల్స్‌ వెలువడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు గ్రూపుల్లోనూ 90 శాతానికిపైగా సానుకూల ఫలితాలు రావడం గమనార్హం. ఇక డమ్మీ చికిత్సపొందిన వలంటీర్లతో పోలిస్తే లో, హై డోసుల గ్రూపుల్లోని వారికి వ్యాక్సిన్‌ వేసిన తర్వాత జ్వరం, నీరసం, ఇంజెక్షన్‌ వేయించుకున్న భాగాల్లో నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ ప్రతికూల ప్రభావం హై డోసు వేయించుకున్న 72 శాతం మందిలో, లో డోసు వేయించుకున్న 74 శాతం మందిలో కనిపించింది. అయితే ఇవన్నీ తేలికపాటి నుంచి మోస్తరు దుష్ప్రభావాలేనని అధ్యయన నివేదికలో ప్రస్తావించారు.


యువకులతో పోలిస్తే.. వయసు పైబడిన వారిలో వ్యాక్సినేషన్‌ ప్రభావంతో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యే రేటు కొంత తక్కువగా ఉండొచ్చని.. అలాంటి వారికి అదనపు డోసు అవసరమవుతుందని బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ప్రొఫెసర్‌ వీ చెన్‌ చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ పనితీరుపై మరింత కచ్చితమైన అంచనాకు వచ్చేందుకు మూడోదశ ప్రయోగ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండాలన్నారు. 

Updated Date - 2020-07-22T07:07:35+05:30 IST