సొంత ప్రయాణాలొద్దు...మేము పంపుతాం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-05-17T23:43:24+05:30 IST

'మీ అంతగా మీరు వెళ్లొద్దు' అంటూ ఢిల్లీలోని వివిధ రాష్ట్రాల వలస కార్మికులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విజ్ఞప్తి..

సొంత ప్రయాణాలొద్దు...మేము పంపుతాం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: 'మీ అంతగా మీరు వెళ్లొద్దు' అంటూ ఢిల్లీలోని వివిధ రాష్ట్రాల వలస కార్మికులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వలస కార్మికుల భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెప్పారు. వారు కోరుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చని, ఒకవేళ సొంత రాష్ట్రాలకు వెళ్తామంటే వారిని తామే స్వయంగా ప్రత్యేక శ్రామిక రైళ్లలో పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలోనూ సొంత ప్రయాణాలు చేయవద్దని కోరారు.


'ఢిల్లీలో జీవిస్తున్న వలస కూలీల పూర్తి బాధ్యత మాది. ఉండాలనుకుంటే ఉండండి. వెళ్తామంటే ప్రత్యేక రైళ్లలో పంపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటిరి ప్రయాణాలు చేయవద్దు' అని కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో కోరారు. ఆదివారం వరకూ ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో సుమారు 47,000 మంది వలస కార్మికులను ఇళ్లకు పంపినట్టు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఉటంకిస్తూ కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు.


మరోవైపు, కాలినడకతో హైవేలు, రైల్వే ట్రాక్‌ల మీదుగా వలస కార్మికులు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులతో సహా సంబంధిత అధికారులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వలస కార్మికులను సహాయ శిబిరాల్లో ఉంచడం, శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో వారిని పంపేందుకు ఏర్పాట్లు చేయడం తప్పనిసరని ఆ నోటీసులో అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2020-05-17T23:43:24+05:30 IST