వైద్యురాలిగా మహిళా ఎస్‌ఐ... ఫోన్ లో సూచనలు వింటూ డెలివరీ
ABN , First Publish Date - 2020-08-20T23:08:52+05:30 IST
ఓ మహిళా ఎస్ఐ వైద్యురాలిగా అవతారమెత్తి ఒక మహిళకు పురుడు పోసింది. అర్థరాత్రి సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆ ఎస్ఐ అన్నీ తానై వ్యవహరించి అండగా నిలబడింది. ఆ మహిళకు వైద్యం చేయడానికి సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో... ఈ మహిళా ఎస్ఐ తనకుతానుగా వైద్యురాలిగా మారిపోయింది.

ఝాన్సీ : ఓ మహిళా ఎస్ఐ వైద్యురాలిగా అవతారమెత్తి ఒక మహిళకు పురుడు పోసింది. అర్థరాత్రి సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆ ఎస్ఐ అన్నీ తానై వ్యవహరించి అండగా నిలబడింది.
ఆ మహిళకు వైద్యం చేయడానికి సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో... ఈ మహిళా ఎస్ఐ తనకుతానుగా వైద్యురాలిగా మారిపోయింది. ఫోన్ లో డాక్టర్ సూచనల మేరకు వైద్యం చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని రావత్‌పురా జిల్లా బింద్‌లో నివసిస్తున్న బాద్‌షా తన భార్య పూజ(19)తో కలిసి గోవా ఎక్స్‌ప్రెస్‌లో దౌండ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్నారు. అయితే... దారిలో పూజకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో వారు ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. అంత రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పాటు ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్లే సమయం కూడా లేకపోయింది.
ఆ సమయంలో... అక్కడే ఉన్న మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్... మరికొంత మంది మహిళల సాయంతో ఏసీ కేబిన్ నుండి కొన్ని దుప్పట్లు తీసుకుని ఆ గర్భిణికి డెలివరీ చేసేందుకు ముందుకు వచ్చారు. తన స్నేహితురాలైన గైనకాలజిస్ట్ డాక్టర్ నీలు కసోటియాకు వీడియో కాల్ చేశారు. ఆ డాక్టర్ ఫోనులో సూచనలు ఇస్తుండగా... ఎస్ఐ రాజకుమారి ఆ గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు.
ఆ వెంటనే... అంబులెన్స్‌ను పిలిపించి తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ తల్లి, బిడ్డ ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన పై ఆ గర్భిణీ భర్త అయిన బాద్‌షా స్పందిస్తూ మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్ లేకపోతే... తన భార్య, బిడ్డ కూడా దక్కేవారు కారంటూ ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు.