‘సింథియా, పైలట్ దూరమవడంతో రాహుల్ గాంధీ బలహీనపడ్డారు’

ABN , First Publish Date - 2020-07-16T03:16:35+05:30 IST

యువ నేతలు జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్ దూరమవడంతో

‘సింథియా, పైలట్ దూరమవడంతో రాహుల్ గాంధీ బలహీనపడ్డారు’

గాంధీనగర్‌ : యువ నేతలు జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్ దూరమవడంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రెండు చేతులను కోల్పోయినట్లయిందని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అన్నారు. బలహీనపడిన కాంగ్రెస్ వల్ల బీజేపీకి మేలు జరుగుతుందని చెప్పారు. 


నితిన్ పటేల్ గాంధీనగర్‌లో బుధవారం మాట్లాడుతూ, మధ్య ప్రదేశ్‌లో ఏం జరిగిందో మనమంతా చూశామన్నారు. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్‌లో అదే జరుగుతోందన్నారు. కాంగ్రెస్ నాయకత్వ పనితీరులో ఏదో లోపం ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. 


కమల్‌నాథ్ నేతృత్వంలోని మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం మార్చిలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరారు. ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వదిలిపెట్టారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 


రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి మంగళవారం తొలగించారు. 


సచిన్ పైలట్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన దీనిని ఖండించారు. తాను బీజేపీలో చేరబోనని తెలిపారు. 


ఈ నేపథ్యంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ బుధవారం మాట్లాడుతూ, ఈ ఇద్దరు యువ నేతలు రాహుల్ గాంధీకి కుడి భుజం, ఎడమ భుజం వంటివారని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రెండు చేతులను కోల్పోయారన్నారు. 


కాంగ్రెస్ పరిస్థితిపట్ల ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ బలహీనపడటం వల్ల బీజేపీకి మంచిదేనన్నారు. 


Updated Date - 2020-07-16T03:16:35+05:30 IST