కర్ణాటక : వర్కర్లకు క్షమాపణ చెప్పిన విస్ట్రన్ కంపెనీ

ABN , First Publish Date - 2020-12-19T21:41:11+05:30 IST

సకాలంలో జీతాలు చెల్లించకపోవడంపై విస్ట్రన్ కార్పొరేషన్ తన

కర్ణాటక : వర్కర్లకు క్షమాపణ చెప్పిన విస్ట్రన్ కంపెనీ

బెంగళూరు : సకాలంలో జీతాలు చెల్లించకపోవడంపై విస్ట్రన్ కార్పొరేషన్ తన ఉద్యోగులకు క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా భారత దేశంలో ఐఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్న ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ను పదవి నుంచి తొలగించింది. తన టీమ్ మెంబర్స్ భద్రత, సంక్షేమానికే తాము పెద్ద పీట వేస్తామని తెలిపింది. 


కర్ణాటకలోని కోలార్ జిల్లా, నరసాపురలో ఉన్న విస్ట్రన్ ప్లాంట్‌లలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనల నేపథ్యంలో కొందరు వర్కర్లకు సక్రమంగా లేదా సకాలంలో జీతాలు చెల్లించలేదని గుర్తించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ పరిణామాల పట్ల తాము తీవ్రంగా చింతిస్తున్నామని, వర్కర్లందరికీ క్షమాపణలు చెప్తున్నామని పేర్కొంది. తమ టీమ్ మెంబర్ల సంక్షేమం, భద్రతలకే తాము పెద్ద పీట వేస్తామని తెలిపింది. విస్ట్రన్ పాటిస్తున్న ప్రధాన విలువలు ఇవేనని తెలిపింది. 


భారత దేశంలో తమ బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్న వైస్ ప్రెసిడెంట్‌ను తొలగించామని, తమ ప్రాసెస్‌లను విస్తరిస్తున్నామని, టీమ్స్‌ను రీస్ట్రక్చర్ చేస్తున్నామని పేర్కొంది. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 


డిసెంబరు 12న ఉదయం ఈ కంపెనీపై ఉద్యోగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తమకు జీతాలు చెల్లించడం లేదని, జీతాల్లో కోత పెడుతున్నారని ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కంపెనీ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో సుమారు 7 వేల మందిపై ఆరోపణలు చేసింది.



Updated Date - 2020-12-19T21:41:11+05:30 IST