28న శశికళ విడుదలయ్యేనా..?

ABN , First Publish Date - 2020-08-18T14:37:09+05:30 IST

28న శశికళ విడుదలయ్యేనా..?

28న శశికళ విడుదలయ్యేనా..?

ఢిల్లీ జర్నలిస్టు ప్రకటనతో రాజకీయ వర్గాల్లో కలకలం 

చెన్నై(ఆంధ్రజ్యోతి) : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ ఈ నెల 28న బెంగళూరు పరపన అగ్రహారం జైలు నుంచి విడుదల కానున్నారని ఢిల్లీకి చెందిన సీనియర్‌ జర్నలిస్టు యూట్యూబ్‌ ఛానెల్‌లో చేసిన ప్రకటన ఇటు అన్నాడీఎంకే వర్గాల్లో నూ, ఇటు అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాల్లోనూ తీవ్ర కలకలం సృష్టించింది. ఇదివరకే శశికళ ఆగస్టు 14న విడుదలవుతారని బీజేపీ నేత ఆశీర్వాదం ఆచారి ట్విట్టర్‌ పెట్టిన సందేశం సృష్టించిన అలజడి సద్దుమణగక ముందే ఢిల్లీ జర్నలిస్టు తాజాగా చేసిన ప్రకటన రెండు పార్టీల్లోనూ గుబులు సృష్టించింది. ప్రభుత్వ సెలవు దినాలు, గతంలో గడిపిన జైలు వాసం, పరపన అగ్రహారం జైలులో సత్ప్రవర్తన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే శశికళ మార్చి నెలలోనే విడుదల కావాల్సి వుందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంథూర్‌ పాండ్యన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న శశికళ విడుదల అవుతా రని కేంద్ర  హోంమంత్రిత్వ శాఖకు కర్నాటక ప్రభుత్వం ఈ నెల 16న ఓ రహస్య సందేశం పంపినట్లు ఢిల్లీ జర్నలిస్టు యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రకటన చేశారు. ఇది నిజమేనా అని శశికళ వర్గీయులను విచారించగా చిన్నమ్మ విడుదల కోసం తామంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, కాబోయే సీఎం ఎవరనే విషయమై ఇప్పటికే అధికార అన్నాడీఎంకేలో విబేధాలు నెలకొన్న నేపథ్యంలో ఆమె విడుదలైతే పార్టీలో మార్పులు జరుగటం ఖాయమని అధికారంలో ఉన్న నేతలు కూడా అనుమానిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కరోనా సంక్షోభ పరిస్థితుల్లో శశికళ విడుదల య్యేందుకు సుముఖంగా లేరని బదులిచ్చారు.   


పదిరోజుల్లో విడుదల అసాధ్యం

గతంలో శశికళకు కుడిభుజంగా వ్యవహరించిన బెంగ ళూరుకు చెందిన పుగళేందిని ఈ విషయమై ప్రశ్నించగా శశికళ ఈ నెల 28న విడుదలవుతుందని చెబుతున్న జర్నలిస్టు కేంద్ర ప్రభుత్వ అధికారి కాదని అతని మాటలను ఎవరూ నమ్మాల్సిన పనిలేదన్నారు. తనకు తెలిసినంత వరకూ శశికళ విడుదలకు ఎన్నో చిక్కులున్నాయని, జైలు నిబంధనలు ఉల్లఘించినట్లు ఆమెపై ఆరోపణలు చేసిన సీనియర్‌ పోలీసు అధికారి రూప ప్రస్తుతం కర్నాటక హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారని, ఆమె లేవనెత్తిన ఆరోపణలపై జరిగిన విచారణ ముగిసి అందుకు తగిన శిక్ష అదనంగా అనుభవించాల్సిన స్థితిలోనే శశికళ ఉన్నారని వివరించారు. ఇక శశికళ రూ.10 కోట్ల అపరాధాన్ని ఇంకా చెల్లించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఇన్ని చిక్కులున్నప్పుడు పదిరోజుల్లో శశికళ విడుదల ఎలా సాధ్యమవుతుందని పుగళేంది ప్రశ్నించారు.   


అవన్నీ పుకార్లే 

ఇక ఈ విషయంపై శశికళ తరఫు న్యాయవాది రాజా సెంథూర్‌ పాండ్యన్‌ను అడిగినప్పుడు శశికళ విడుదలకు సంబంధించి కర్నాటక ప్రభుత్వం నుంచి తొలి సమా చారం తమకు మాత్రమే తెలియజేస్తారని వెల్లడించారు. ఇప్పటి దాకా శశికళ విడుదల తేదీ గురించి కర్నాటక ప్రభుత్వం తమకు తెలపలేదన్నారు. శశికళ చెల్లించాల్సిన అపరాధ రుసుము సిద్ధంగానే ఉందని, ఆ సొమ్ము సరైన సమయంలో చెల్లిస్తామని, ఆ తర్వాతే ఆమె విడుదలకు చర్యలు చేపడతామన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా శశికళ ఈ నెల 28న విడుదలవుతుందని ఈ కేసుతో ఎలాంటి సంబందాలులేని ఢిల్లీ పాత్రికేయుడు ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. శశికళను వీలైనంత త్వరగా విడుదల చేయించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ఈ విషయంలో పనిగట్టుకుని కొందరు ఆమెపై పుకార్లు పుట్టించడం సమంజసం కాదని రాజా సెంధూర్‌ పాండ్యన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-18T14:37:09+05:30 IST