రాహుల్ మనసు మార్చుకుంటారా!?
ABN , First Publish Date - 2020-08-11T07:09:11+05:30 IST
కాంగ్రెస్ చీఫ్ ఎవరు? సోనియా గాంధీనా? రాహుల్ గాంధీనా!? ప్రియాంక గాంధీనా? గాంధీ కుటుంబమేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించే పరిస్థితి ప్రస్తుతం లేదు...

- ప్రియాంక రంగంలోకి రానున్నారా?
- కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఆసక్తి
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ చీఫ్ ఎవరు? సోనియా గాంధీనా? రాహుల్ గాంధీనా!? ప్రియాంక గాంధీనా? గాంధీ కుటుంబమేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించే పరిస్థితి ప్రస్తుతం లేదు. మరి, ఇంకా సోనియా కొనసాగుతారా? మరోసారి రాహుల్ రంగంలోకి దిగుతారా? లేక, ప్రియాంక తెరపైకి వస్తారా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్న ఆసక్తి ఇది. వయసు, అనారోగ్యం కారణంగా సోనియా కొనసాగే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
నిజానికి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీ పదవీ కాలం ఆదివారంతో పూర్తయింది. అయితే, కొత్త నేతను ఎంపిక చేసేంతవరకూ సోనియాగాంధీ కొనసాగుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరలో ప్రకటించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అక్టోబరు ఒకటో తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయి, పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి రాహుల్ గాంధీ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో, ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను ప్రక టించినా.. ఆయన పోటీ చేస్తారా? లేదా!? ప్రియాంక రంగంలోకి దిగుతారా అన్న విషయంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.