భారత్-చైనా ఘర్షణ ప్రభావం తమిళనాడులో చైనా పెట్టుబడులపై పడబోతోందా?

ABN , First Publish Date - 2020-06-18T23:53:04+05:30 IST

గాల్వన్ లోయలో భారత సైనికులతో చైనా సైనికులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో

భారత్-చైనా ఘర్షణ ప్రభావం తమిళనాడులో చైనా పెట్టుబడులపై పడబోతోందా?

చెన్నై : గాల్వన్ లోయలో భారత సైనికులతో చైనా సైనికులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో చైనాపై భారతీయుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. చైనా సైనికుల దుశ్చర్యకు 20 మంది భారత సైనికులు అమరులు కావడం భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనకు దారి తీసిన ఈ సంఘటన పట్ల భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ప్రతిష్టంభన, సంఘర్షణ మరింత తీవ్రమైతే, తమిళనాడులోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులు, నిధులపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు, పెరిఫెరల్ రోడ్ ప్రాజెక్టులకు బీజింగ్‌లోని ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) రుణాలు ఇచ్చేందుకు గతంలో అంగీకరించింది. పెరిఫెరల్ రోడ్ ప్రాజెక్టు రెండో, మూడో దశలకు గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 


కోల్‌కతా, తిరుపతి, బెంగళూరులను కలుపుతూ ఉత్తర చెన్నైలోని తాచూర్-శ్రీపెరుంబుదూర్ జాతీయ రహదారికి కూడా ఏఐఐబీ నుంచి నిధులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. 


తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాకు వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే, ఈ ప్రాజెక్టులకు నిధుల లభ్యతపై ఆ ప్రభావం పడుతుంది. అయితే కొందరు ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఈ విషయంలో ఇప్పుడే ఏదైనా ఆలోచించడం తొందరపాటు అవుతుందని చెప్తున్నారు.



Updated Date - 2020-06-18T23:53:04+05:30 IST