కేరళ, బెంగాల్‌లో ఉద్యమాలు ఎందుకు చేయరు? ప్రతిపక్షాలపై మోదీ ఫైర్

ABN , First Publish Date - 2020-12-25T19:10:19+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీలు

కేరళ, బెంగాల్‌లో ఉద్యమాలు ఎందుకు చేయరు? ప్రతిపక్షాలపై మోదీ ఫైర్

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీలు వచ్చి రైతుల భూములను లాక్కొంటాయని ప్రచారం చేస్తున్నారని, అలాంటివేమీ జరగవని, రైతుల భూములను కార్పొరేట్లు లాక్కోరని మోదీ హామీ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ లాంటి రిమోట్ ప్రాంతాల్లోని రైతులు కూడా దీనిని నమ్మాలని మోదీ కోరారు. ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ రైతుల భూములను లాక్కోరని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో ‘కిసాన్ సమ్మేళన్’ నిర్వహించారు.  ఈ సందర్భంగా ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’’ నుంచి రైతుల అకౌంట్లలోకి 18,000 కోట్ల రూపాయలను ప్రధాని జమ చేశారు. ఎలాంటి దళారులు, కమిషన్లు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని ఆయన తెలిపారు.


కొందరు వ్యక్తులు వార్తల్లో నిలవడానికి, చర్చల్లో నానడానికి ఢిల్లీలో ఈవెంట్ ప్రోగ్రాంలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ పరిస్థితిపై మౌనంగా ఉన్నవారు నేడు ఢిల్లీకి వచ్చి ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలో గుడారాలు వేసుకొని ఉన్నవారికి కేరళ ఏమాత్రం కనిపించదని పరోక్షంగా వామపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. పినరయ్ విజయన్ నేతృత్వంలోని కేరళలో కూడా మార్కెట్ యార్డులు లేవని కానీ అక్కడ ఏమాత్రం ఆందోళనలు నిర్వహించరని విమర్శించారు. వాస్తవాలను దాచేసి, రాజకీయాలు చేసి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను బద్నాం చేసి కొందరు తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్నారని, రాజకీయాల్లో మెరిసిపోతున్నారని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకంటే ముందున్న ప్రభుత్వాల విధానాల వల్లే రైతులు నష్టపోయారని, తాము మాత్రం వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి రైతులకు నూతన బలాన్ని ఇచ్చామని పేర్కొన్నారు.


పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డ్, సమ్మాన్ నిధి యోజన లాంటి వాటి ద్వారా వ్యవసాయాన్ని లాభతరం చేయాలని చూస్తున్నామని, రైతుల ఖర్చులు తగ్గించడానికే తాము కృషి చేస్తున్నామని తెలిపారు. పండించిన పంటకు మంచి ధర ఎక్కడ వస్తుందన్నది రైతులకు బాగా తెలుసని, నూతన చట్టాలతో పండించిన పంటలను రైతు ఎక్కడైనా అమ్ముకునే వీలుందని ఆయన నొక్కి వక్కానించారు. ఈ విధంగా రైతులు లాభపడితే వచ్చిన తప్పేంటని? ప్రతిపక్షాలను ప్రశ్నించారు. 


బెంగాల్, కేరళపై విరుచుకుపడ్డ మోదీ

కిసాన్ సమ్మేళనం సందర్భంగా ప్రధాని మోదీ బెంగాల్, కేరళ ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వ్యవసాయ మార్కెట్ల గురించి మాట్లాడుతున్న నేతలు బెంగాల్, కేరళలో వాటిని విధ్వంసం చేశారని మోదీ మండిపడ్డారు. కేరళలో మార్కెట్ యార్డులు లేవని, అలాంటిది కేరళలో ఎందుకు ఆందోళనలు నిర్వహించడం లేదని సూటిగా ప్రశ్నించారు. అక్కడ ఎందుకు ఉద్యమాలు చేపట్టరని నిలదీశారు. కానీ... పంజాబ్‌లో ఉన్న రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవపట్టిస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ విధానాలన్నీ బెంగాల్‌ను విధ్వంసం చేసేలా ఉన్నాయని, ఆమె విధానాలన్నీ రైతు వ్యతిరేక విధానాలని దుయ్యబట్టారు. రైతులకు ఎలాంటి లాభాలు అందకుండా మమత బెనర్జీ చేస్తున్నారని మోదీ ఆరోపించారు. 

Updated Date - 2020-12-25T19:10:19+05:30 IST