డయ్యర్ తరహాలో పోలీసు చర్య: పోలింగ్ వేళ తేజస్వి ఫైర్
ABN , First Publish Date - 2020-10-28T18:07:30+05:30 IST
బీహార్‌లోని ముంగెర్లో చోటుచేసుకున్న పోలీసు కాల్పుల ఘటనపై ఆర్జేడీ నేత ..

పాట్నా: బీహార్‌లోని ముంగెర్లో చోటుచేసుకున్న పోలీసు కాల్పుల ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఘాటుగా స్పందించారు. నితీష్ కుమార్ సర్కార్‌ను తప్పుపట్టారు. జనరల్ డయ్యర్ తరహాలో పోలీసు చర్యకు ఎవరు అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారంనాడు ఓ ట్వీట్ చేశారు. బీహార్ తొలి విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తేజస్వి ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'ఒక వ్యక్తి మృతికి కారణమైన ముంగెర్ పోలీసు కాల్పులను మేము ఖండిస్తున్నాం. ప్రస్తుతం డబుల్ ఇంజెన్ ప్రభుత్వం పాత్ర ఇందులో కచ్చితంగా ఉంది. జనరల్ డయ్యర్ తరహా కాల్పులకు అనుమతి ఇచ్చిందెవరో చెప్పాలని ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని మేము అడుగుతున్నాం. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి' అని తేజస్వి ఆ ట్వీట్లో డిమాండ్ చేశారు. గత సోమవారం రాత్రి దుర్గా నిమజ్జనానికి హాజరైన పలువు వ్యక్తులు, కొత్వాలి పోలీస్ సిబ్బంది మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుని పరిస్థితి అదుపు తప్పింది. కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ముంగెర్లో మంగళవారంనాడు భారీగా భద్రతా సిబ్బందిని మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న సుమారు 100 మంది వ్యక్తులను రాష్ట్ర పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. 12 ఖాళీ కాట్రిడ్జ్‌లను ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నారు.