కోవిడ్-19 మహమ్మారిపై హెచ్చరికను ఆలస్యం చేయాలని జీ జిన్‌పింగ్ కోరలేదు : డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-05-10T21:35:32+05:30 IST

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ

కోవిడ్-19 మహమ్మారిపై హెచ్చరికను ఆలస్యం చేయాలని జీ జిన్‌పింగ్ కోరలేదు : డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసుస్‌కు ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని డబ్ల్యూహెచ్‌వో ఖండించింది. టెడ్రోస్‌కు జిన్‌పింగ్ ఫోన్ చేసి, నోవల్ కరోనా వైరస్ మహమ్మారిపై అంతర్జాతీయ హెచ్చరికను ఆలస్యం చేయాలని కోరినట్లు వెలువడిన మీడియా కథనం నిరాధారమైనదని పేర్కొంది. 


జర్మన్ న్యూస్ ఔట్‌లెట్ ‘డెర్ స్పీగెల్’ ఆ దేశ ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌ను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. టెడ్రోస్‌కు జిన్‌పింగ్ ఫోన్ చేసి, నోవల్ కరోనా వైరస్ మహమ్మారిపై అంతర్జాతీయ హెచ్చరికను ఆలస్యం చేయాలని కోరినట్లు పేర్కొంది. జిన్‌పింగ్ జనవరి 21న టెడ్రోస్‌కు ఫోన్ చేసినట్లు తెలిపింది. మనిషి నుంచి మనిషికి నోవల్ కరోనా వైరస్ వ్యాపించడం గురించి సమాచారాన్ని నిలిపేయాలని, ఈ మహమ్మారిపై హెచ్చరికను ఆలస్యం చేయాలని జిన్‌పింగ్ కోరినట్లు పేర్కొంది. 


ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ట్విటర్ వేదికగా స్పందించింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ డాక్టర్ టెడ్రోస్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ఎటువంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. వీరిద్దరి మధ్య 2020 జనవరి 21న ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లు ‘డెర్ స్పీగెల్’ కథనం పేర్కొంటోందని, ఇదంతా అవాస్తవమని, నిరాధారమైనదని తెలిపింది. జనవరి 21న డాక్టర్ టెడ్రోస్, జీ జిన్‌పింగ్ చర్చలు జరపలేదని, వారిద్దరూ ఫోన్‌లో ఎప్పుడూ మాట్లాడుకోలేదని వివరించింది. ఇటువంటి నిరాధారమైన కథనాలు డబ్ల్యూహెచ్‌వో, ప్రపంచం కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం చేస్తున్న కృషిని పక్కదోవపట్టిస్తాయని పేర్కొంది.


మనిషి నుంచి మనిషికి నోవల్ కరోనా వైరస్ సోకుతుందని చైనా జనవరి 20న ప్రకటించిన సంగతిని డబ్ల్యూహెచ్ఓ గుర్తు చేసింది. అదేవిధంగా తాము కూడా జనవరి 22న విడుదల చేసిన ప్రకటనలో అప్పటి వరకు  సేకరించిన సమాచారం ప్రకారం వూహన్‌లో మనిషి నుంచి మనిషికి నోవల్ కరోనా వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్న సంగతిని గుర్తు చేసింది.


కరోనా వైరస్ ఓ మహమ్మారి అని డబ్ల్యూహెచ్ఓ మార్చిలో ప్రకటించింది.


Updated Date - 2020-05-10T21:35:32+05:30 IST