మాకెక్కడ చలి? మోదీకే చలి పుట్టిస్తాం..

ABN , First Publish Date - 2020-12-10T07:20:19+05:30 IST

సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు రహదారిపైనే గడిపేందుకు రైతులు సిద్ధపడే వచ్చారు. కనీసం ు రెండు నెలలైనా ఇక్కడ

మాకెక్కడ చలి? మోదీకే చలి పుట్టిస్తాం..

‘ఆంధ్రజ్యోతి’తో రైతులు

న్యూఢిల్లీ,  డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు రహదారిపైనే గడిపేందుకు రైతులు సిద్ధపడే వచ్చారు. కనీసం ు రెండు నెలలైనా ఇక్కడ ఉండేందుకు వచ్చామని వారు చెబుతున్నారు. గుడారాలు వేసుకుని, జంబుఖానాలు పరుచుకుని రహదార్ల పైనే నిద్రిస్తున్నారు. తాత్కాలికంగా ధాబాలు వేసుకుని వంటలు చేసుకుంటున్నారు. చలి బాగా ఎక్కవుందనుకుంటేనే రాత్రి పూట స్వెట్టర్లు వేసుకునే వారు... ఉదయం కాగానే స్వెట్టర్లు తీసేస్తున్నారు. 15 డిగ్రీల టెంపరేచర్‌ దాటితే వారికి చలి ఒక లెక్క కాదు. తలపాగాలు, పగిడీలు వారికి శాశ్వత కిరీటాలై చలి నుంచి కాపాడుతూ రైతే రాజన్నలనిపిస్తున్నాయి.


రోడ్డు పక్కనే వారు చల్లటి నీళ్లలో స్నానాలు చేస్తున్నారు. క్రమశిక్షణ ప్రకారం కూర్చుని టీలు తాగడం, భోజనాలు చేయడం చేస్తున్నారు.  యువకులు పెదపెద్ద పెనాలపై రొట్టెలు , పెద్ద గిన్నెలల్లో పప్పు, ఆలుగడ్డలను వండి, అందరికీ పంచిపెడుతున్నారు. మీరూ తినండి... అని మీడియా ప్రతినిధులకూ ఆఫర్‌ చేస్తూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. రైతులు అక్కడికక్కడే కవులు, గాయకులు కూడా అవుతున్నారు.ఒకరి తర్వాత మరొకరు ఉపన్యాసాలు చేసి ఇక చాలు అనుకున్నపుడు మధ్యలో హార్మోనియాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. వృద్దులు పాటలు పాడేందుకు బాగా ముందుకు వస్తున్నారు.


’కలలు చూపించారు మాకు మంచి రోజులు వస్తాయని.. ఇవేనా మంచి రోజులు.. మీరు ఢిల్లీ సింహాసనం పై కూర్చుంటే మేము రోడ్లు పట్టి తిరుగుతున్నాం.  దేశానికి అన్నం పెట్టేవారికి లాఠీ, గోలీలు తినిపిస్తున్నారు.. ఇదేనా అచ్చేదిన్‌’ అని ఒక వృద్దుడు పాడుతుంటే అందరూ చప్పట్లు చరిచారు. వారి పాటల్లో నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, గుజరాత్‌ అల్లర్ల ప్రస్తావన కూడా వినపడుతోంది. మాకు ఆట పాటలే వెచ్చదనాన్ని రగిలిస్తాయి. చలిని పారద్రోలుతుయాయి.. అంటున్నారు వారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో రైతు ప్రతినిధుల చర్చలు విఫలమయ్యాయని తెలిసినపుడు వారెక్కడా తొట్రుపడలేదు.’ ఇలా జరుగుతుందని, మోదీ ప్రభుత్వం ఇలాగే చేస్తుందని తెలుసు.. మేము ఇక్కడి నుంచి వెళ్లము..... రైతన్నల సత్తా ఏమిటో చూపిస్తాం. పోరాటం ఉధృతం చేస్తాం..’ అని ఒక రైతు ప్రతినిధి అన్నారు. 


Updated Date - 2020-12-10T07:20:19+05:30 IST