పశ్చిమ బెంగాల్‌కు బాకీపడిన రూ.53 వేల కోట్లు ఇవ్వండి : మోదీకి మమత వినతి

ABN , First Publish Date - 2020-08-12T02:16:54+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చెల్లించవలసిన బాకీల గురించి ఆ రాష్ట్ర

పశ్చిమ బెంగాల్‌కు బాకీపడిన రూ.53 వేల కోట్లు ఇవ్వండి : మోదీకి మమత వినతి

కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చెల్లించవలసిన బాకీల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్ళారు. తమ రాష్ట్రానికి జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) పరిహారం, ఇతర బాకీలు భారీగా ఉన్నాయని, వాటిని చెల్లించాలని కోరారు. 


కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొన్నారు. 


పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఎఫ్ఆర్‌బీఎం చట్టం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్) పరిమితిని 3 శాతం నుంచి 5 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం పెంచిందని, అయితే ఈ పెంపులో 0.5 శాతం మాత్రమే బేషరతుగా రుణం పొందడానికి అవకాశం ఇచ్చారని, మిగిలిన 1.5 శాతం కూడా ఒక ఏడాదిపాటు బేషరతుగా రుణం పొందడానికి అవకాశం కలిగే విధంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని మమత బెనర్జీ కోరారు. 


పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ.4,135 కోట్లు జీఎస్‌టీ నష్టపరిహారం రావలసి ఉందని, రూ.53,000 కోట్లు మొత్తం మీద రావలసిన బాకీలు ఉన్నాయని, వీటిని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 


కోవిడ్-19కు వాడవలసిన వ్యాక్సిన్ గురించి స్పష్టత ఇవ్వాలని కూడా మమత బెనర్జీ కోరారు. సేకరించవలసిన వ్యాక్సిన్ గురించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలియజేయాలని కోరారు. ఈ వ్యాధికి చికిత్స కోసం తమకు వెంటిలేటర్లు, ఇతర పరికరాలు అవసరమని, వాటిని సరఫరా చేయాలని కోరారు. 


Updated Date - 2020-08-12T02:16:54+05:30 IST