బెంగాల్‌లో తొలి స్ట్రెయిన్.. దేశ వ్యాప్తంగా 20 కేసులు
ABN , First Publish Date - 2020-12-30T20:32:07+05:30 IST
యూకేలో తలెత్తిన కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్‌లోకి అడుగుపెట్టిన ఛాయలు ..

కోల్‌కతా: యూకేలో తలెత్తిన కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్‌లోకి అడుగుపెట్టిన ఛాయలు కనిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో తొలి కరోనా స్ట్రెయిన్ కేసు నమోదైనట్టు ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు బుధవారంనాడు తెలిపారు. యూకే నుంచి తిరిగివచ్చిన మెడికల్ కాలేజీ అధికారి కుమారుడు ఒకరికి వైద్యపరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం అతను నగరంలోని ప్రభుత్వ ఐసొలేషన్ ఫెసిలిటీలో చికిత్స తీసుకుంటున్నాడని అన్నారు. పది రోజుల క్రితం కోల్‌కతా వచ్చినప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పరీక్షలు జరపగా, పాజిటివ్ వచ్చినట్టు తేలిందన్నారు. అతని శాంపుల్స్‌పై మరిన్ని పరీక్షలు సాగిస్తున్నామని అన్నారు. రిపోర్ట్‌ను ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపినట్టు వెల్లడించారు. కాగా, దేశంలో ఇంతవరకూ 20 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.