ఆ అధికారులను ఘెరావ్ చేయండి.. టీఎంసీ కార్యకర్తలకు మమత పిలుపు!

ABN , First Publish Date - 2020-12-29T15:05:22+05:30 IST

పశ్చిమ బెంగాల్లోని దుబ్రాజ్‌పూర్ వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్ 60 బైపాస్ రోడ్డు నిర్మాణం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండడంపై...

ఆ అధికారులను ఘెరావ్ చేయండి.. టీఎంసీ కార్యకర్తలకు మమత పిలుపు!

బోల్పూర్: పశ్చిమ బెంగాల్లోని దుబ్రాజ్‌పూర్ వద్ద ఎన్‌హెచ్ 60 బైపాస్ రోడ్డు నిర్మాణం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనులు పూర్తయ్యేదాకా అధికారుల ఇళ్లముందు పోస్టర్లు అతికించి, ర్యాలీలు తీసి, అధికారులను ఘెరావ్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మమత పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఓ సమీక్షా సమావేశం సందర్భంగా బీర్భూమ్ జిల్లా  దుబ్రాజ్‌పూర్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం పెండింగ్‌పై స్థానికుల నుంచి ఆమెకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై మమత స్పందిస్తూ... ఎన్‌హెచ్ 60 పనులను కేంద్రం కావాలనే నిలిపివేసిందని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ రోడ్డు నిర్మాణం మా చేతుల్లో లేదు. దీని బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. రోడ్డు నిర్మాణానికి మేము మా వంతుగా స్థలం కేటాయించాం. ఇక్కడే కాదు... కృష్ణా నగర్ రా‌న్‌ఘాట్‌లో కూడా కావాలనే ఇలాగే పెండింగ్‌లో పెట్టారు..’’ అంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఈ పనులు ఎందుకు పూర్తిచేయడం లేదనేదానిపై నిలదీస్తూ రోడ్డు మీద పోస్టర్లు అతికించాలని ఆమె స్థానిక టీఎంసీ కార్యకర్తలకు సూచించారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించమని చెప్పండి. మేమే దాన్ని పూర్తిచేస్తాం. అప్పటి వరకు దీనిపై గళం వినిపించేందుకు సదస్సులు పెట్టండి. ర్యాలీలు తీసి, అధికారులను ఘెరావ్ చేయండి..’’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-12-29T15:05:22+05:30 IST