గత కాలపు ఫలాలను కాపాడుకోవాలి : మోదీ

ABN , First Publish Date - 2020-12-11T22:06:56+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ సంపూర్ణంగా ఆ దేశ నాయకత్వంలో, యాజమాన్యంలో,

గత కాలపు ఫలాలను కాపాడుకోవాలి : మోదీ

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ సంపూర్ణంగా ఆ దేశ నాయకత్వం, యాజమాన్యం, నియంత్రణలో జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గడచిన రెండు దశాబ్లాల్లో సాధించిన విజయాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఉజ్బెక్ ప్రెసిడెంట్ షవకత్ మిర్జియోయెవ్‌తో శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత దేశం, ఉజ్బెకిస్థాన్ దృఢంగా నిలుస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ రెండు దేశాలకు అతివాదం, ఛాందసవాదం, వేర్పాటువాదాలపై ఒకే విధమైన ఆందోళన ఉందన్నారు. ప్రాంతీయ భద్రత సమస్యలపై కూడా ఒకేవిధమైన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ పూర్తిగా ఆ దేశ నాయకత్వంలో జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను ఆఫ్ఘనిస్థాన్ సొంతంగా నిర్వహించాలని, నియంత్రించాలని ఆకాంక్షించారు. గడచిన రెండు దశాబ్దాల్లో సాధించిన విజయాలను కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఇటీవల ఉన్నతస్థాయి ఆఫ్ఘన్ పీస్ నెగొషియేటర్ అబ్దుల్లా అబ్దుల్లా, ఇతర సీనియర్ నేతలు వచ్చిన సంగతి తెలిసిందే. 


ఉజ్బెకిస్థాన్‌తో అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని భారత దేశం కోరుకుంటున్నట్లు శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో మోదీ తెలిపారు. సెంట్రల్ ఆసియాలో ఉజ్బెకిస్థాన్ ప్రధాన దేశమని చెప్పారు. ఆ దేశాన్ని ‘ఎక్స్‌టెండెడ్ నెయిబర్‌హుడ్’గా భారత దేశం పరిగణిస్తోందన్నారు. 


Updated Date - 2020-12-11T22:06:56+05:30 IST