మరి కొంతకాలం కరోనాతో సహజీవనమే

ABN , First Publish Date - 2020-05-18T08:55:52+05:30 IST

కరోనా వైర్‌సకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని, ప్రపంచం మరికొంత కాలం కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ఐరోపా దేశాల నేతలు చెబుతున్నారు. ఆ మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో...

మరి కొంతకాలం కరోనాతో సహజీవనమే

  • వ్యాక్సిన్‌కు వేచిచూడలేమంటున్న ఐరోపా నేతలు
  • నేడు ఇటలీలో తెరచుకోనున్న బార్లు, రెస్టారెంట్లు

సోవే(ఇటలీ), మే 17: కరోనా వైర్‌సకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని, ప్రపంచం మరికొంత కాలం కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ఐరోపా దేశాల నేతలు చెబుతున్నారు. ఆ మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. ఐరోపాలో ఇప్పటి వరకు కరోనాతో 1.60 లక్షల మంది చనిపోయారు. అందులో అత్యధికంగా బ్రిటన్‌లో 34,000 మంది, ఇటలీలో 32,000 మంది ఉన్నారు. కాగా, సోమవారం నుంచి ఇటలీలో బీచ్‌లు, రెస్టారెంట్లు, బార్లు తెరిచేందుకు ఆ దేశ ప్రధాని గ్యుసెప్‌ కొంటే అనుమతి ఇచ్చారు. అదే సమయంలో చర్చిలు కూడా తెరుచుకోనున్నాయి. వ్యాక్సిన్‌ తయారయ్యే వరకూ ఇటలీ వేచి చూడలేదని శనివారం గ్యుసెప్‌ వ్యాఖ్యానించారు. గతనెలలో కొవిడ్‌-19 బారినపడి ఆస్పత్రి పాలైన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా ఆదివారం అలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, వ్యాక్సిన్‌ తయారయ్యే అవకాశం లేదని జాన్సన్‌ అన్నారు. ‘దానికి ఇంకా చాలా కాలం పడుతుంది. వ్యాక్సిన్‌ ఫలప్రదమవదని నేను స్పష్టంగా చెప్పగలను. ఇలాంటి ప్రయత్నాల బదులు కొంతకాలం వైర్‌సతోనే కలిసి జీవించాల్సి ఉంటుందని మనం తెలుసుకోవాలి’ అన్నారు. లాక్‌ డౌన్‌ నుంచి బయటపడేందుకు దేశం బుడిబుడి అడుగులు వేస్తోందని చెప్పారు. అలాగే, జర్మనీలో సాకర్‌ మ్యాచ్‌లు పునఃప్రారంభమయ్యాయి. గ్రీస్‌లో చర్చిలు 2 నెలల తర్వాత ఆదివారం తెరుచుకున్నాయి.


Updated Date - 2020-05-18T08:55:52+05:30 IST