118 ఏళ్ల కిందే సోలార్ పవర్ గురించి చర్చ: మోదీ

ABN , First Publish Date - 2020-12-15T21:26:46+05:30 IST

118 ఏళ్ల కిందే సోలార్ పవర్ గురించి చర్చ: మోదీ

118 ఏళ్ల కిందే సోలార్ పవర్ గురించి చర్చ: మోదీ

అహ్మదాబాద్: గుజరాత్‌లో 118 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 15) సోలార్ ఎనర్జీ డివైజ్ గురించి చర్చ జరిగిందని, మళ్లీ ఈరోజున సోలార్ పార్క్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలోని కచ్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న సాంకేతికతకు అభివృద్ధికి అనుగుణంగా కచ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు కచ్ కేంద్రం అవుతుందని మోదీ అన్నారు.


‘‘నేను గుజరాత్‌కు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రోజులో కొద్ది గంటలైన కరెంట్ ఇవ్వండని ప్రజలు అడిగేవారు. రాత్రి భోజనం చేసేంత వరకైనా కరెంట్ ఉంటే చాలనుకునే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. ఇండియాలో 100 శాతం కరెంట్ సప్లై ఉన్న మొట్ట మొదటి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. అంతే కాకుండా రైతుల కోసం కూడా గుజరాత్‌లో చాలా అభివృద్ధి జరిగింది. రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. సోలార్ పవర్‌ను చాలా రోజుల క్రితమే అందిపుచ్చుకుని వేగంగా పెంచుకున్న రాష్ట్రం కూడా గుజరాత్‌నే’’ అని మోదీ అన్నారు.

Updated Date - 2020-12-15T21:26:46+05:30 IST