బెంగాల్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘన జరుగుతోంది.. తేల్చిచెప్పిన కేంద్ర బృందం
ABN , First Publish Date - 2020-04-27T02:54:38+05:30 IST
లాక్‌డౌన్ నిబంధనల అమలుకు బెంగాల్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర బృందం...

కలకత్తా: లాక్‌డౌన్ నిబంధనల అమలుకు బెంగాల్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర బృందం తేల్చి చెప్పింది. ఆదివారం ఉత్తర బెంగాల్‌లోని కొన్ని జిల్లాలతో పాటు కలకత్తాలో పర్యటించిన కేంద్ర అధికారులు అనేక చోట్ల ఉన్న కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలియజేశారు. ఈ నెల 20న బెంగాల్ చేరుకున్నామని, అయితే తమ విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు ఇక్కడి ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు. స్థానికంగా ఉన్న అనేక మార్కెట్లలో పర్యటించామని, దుకాణాలను పరిశీలించామని, ఎక్కడా లాక్‌డౌన్ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృంద ప్రధానాధికారి వినీల్ జోషి మాట్లాడుతూ, రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఇక్కడి పరిస్థితులకు సంబంధించి తమకు అందాల్సిన నివేదికలను కూడా ప్రభుత్వం ఇంకా అందజేయలేదన్నారు.
కలకత్తాలో పర్యటించిన బృంద ప్రధానాధికారి అపూర్వ చంద్ర అక్కడి పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హాకు రెండు లేఖలు రాశారు. తాను పర్యటించిన ప్రాంతాల్లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, కేంద్ర హోంశాఖ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని, ప్రభుత్వం కూడా తమకు సహకరించడం లేదని ఆ లేఖల ద్వారా తెలియజేశారు. కలకత్తాలోని కిద్దెర్‌పోరా మార్కెట్ ప్రాంతం, పోర్ట్ ఏరియాల్లో పర్యటించిన అధికారుల బృందం అక్కడి ప్రజలెవరూ లాక్‌డౌన్ నిబంధనలను పాటించడం లేదని, వారిని అడ్డుకునేందుకు కూడా ఎవరూ లేరని తెలిపారు. దానికి సంబంధించి తాము ఫోటోలు, వీడియోలు తీసుకున్నట్లు వెల్లడించారు.